Vijayawada YSRCP Leader Irregularities : విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి తడి బూడిద వెలువడుతుంది! స్థానిక యువకులు ఈ తడిబూడిదను ఉచితంగా తీసుకెళ్లి ఇటుకబట్టీలు, ఫ్లైయాష్ బ్రిక్స్ తయారు చేసేవాళ్లకు అమ్ముకునే వారు. 2019 తర్వాత ఓ మంత్రి కన్ను దీనిపై పడింది. వీటీపీఎస్(VTPS) ట్రక్కు టెర్మినల్ పక్కనే తన టిప్పర్లను పెట్టించారు. వాటికే అక్కడ బూడిదను నింపుతారు. బూడిదను జాతీయ రహదారి నిర్మాణంలో వాడొచ్చని కేంద్రం గతేడాది ఆదేశాలిచ్చాక ఆయన పంట పండింది. గతంలో 10టన్నుల లారీ బూడిద 3వేలకు అమ్మితే ఇప్పుడు 10వేలవరకూ అమ్ముకుంటున్నారు. మంత్రిగారి కన్ను పడ్డాక తామంతా రోడ్డున పడ్డామని బూడిద రవాణా యాజమాన్యాలు కలెక్టర్‌కూ ఫిర్యాదు చేశారు. అయినా ఫలితంలేదు. ఇదొక్కటే కాదు మట్టి, ఇసుక రవాణాలోనూ ఆయన కోట్లు కొల్లగొడుతున్నారు.
YSRCP Leader : అక్రమార్జన రుచిమరిగిన ఆయన ప్రతిపనికీ ఓ రేటుపెట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ వేయాలంటే కమీషన్.! రోడ్డు మరమ్మతు చేయాలంటే కమీషన్.! చివరకు ప్రజలకు అవసరమైన పనులు ప్రభుత్వానికి ప్రతిపాదించాలన్నా కమీషన్.! విరాళాల పేరుతో బలవంతపు వసూళ్లు. ఖర్చుల పేరుతో కమీషన్లను గుంజడం, చేపల చెరువుల నుంచి భూకబ్జాల వరకు ఆయన చేయని దందా అంటూ లేదు. ఇసుక తవ్వకాలకు అడ్డగోలుగా వేలం నిర్వహించి మండలానికి 50 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు.
చదువులమ్మ ఒడిలో సమస్యల వ్యథ - విద్యార్థులను వెంటాడుతున్న వసతుల లేమి!
నియోజకవర్గంలో ఆ మంత్రి నేరుగా ముడుపులు స్వీకరించరు. పీఏ(PA) ద్వారా దండుకుంటుంటారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకూ వసూలు చేస్తారు. స్వపక్షం, విపక్షం అనే పక్షపాతం ఆయనకుండదు.! ఎకరాకు 20 వేల రూపాయలు చెల్లిస్తే చాలు అధికారులతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా చేపల చెరువులు తవ్వుకునే లైసెన్స్ ఇచ్చేస్తారు.! మంత్రి కార్యాలయానికి ముట్టే ముడుపులే అక్రమ నిర్మాణాలకు అనుమతులు. పట్టాదారు పాసుపుస్తకాల జారీకి ఎకరానికి 20 వేలు ధర నిర్ణయించారని రైతులు గుండెలు బాదుకునే పరిస్థితి.
మంత్రి వస్తే లేచి నిలబడే సంస్కారం లేదా? : భూమి కొనుగొలును వరంగా మార్చుకున్నారా మంత్రి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఓ పట్టణంలో జగనన్న లే-అవుట్ కోసం ప్రభుత్వం 40 ఎకరాలు కొనుగోలు చేసింది. మార్కెట్ ధరను పెంచి భూములు కొనిపించిన మంత్రి ఎకరాకు 5 లక్షల నుంచి 6 లక్షల వరకూ కమీషన్ వసూలు చేశారు. భూములిచ్చిన రైతులకు అందాల్సిన పరిహారం నుంచీ 2 కోట్లకు పైగా కమీషన్ దండుకున్నారు.! జలవనరుల శాఖ ఇంజినీర్లపై ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడేవారాయన. 'మంత్రి వస్తే లేచి నిలబడే సంస్కారం లేదా?' అంటూ మండిపడేవారు. తన నియోజకవర్గంలో జల వనరుల శాఖకు సంబంధించి 25 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టి అందులోంచి 25 శాతం కమీషన్ తీసుకున్నారు. మడ భూముల్ని ఆక్రమించి చెరువులుగా మార్చేశారు. ఈ వ్యవహారంలో కోట్లు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి.
'సిద్ధం' బాటలో ఆర్టీసీ బస్సులు - ఏపీలో ప్రయాణికుల అష్టకష్టాలు
కాంట్రాక్టర్ నుంచి 10 శాతం కమీషన్ : 52 కోట్ల రూపాయల విలువైన ఓ రోడ్డు పనులకు పని ప్రారంభంకాకుండానే కాంట్రాక్టర్ నుంచి 10 శాతం కమీషన్ కొట్టేసిన ఘటికుడు ఆ మంత్రి.! ఓ ఊళ్లో వంతెన నిర్మాణానికి సొంతపార్టీ నేతలే ప్రజల నుంచి 40 లక్షల వరకు విరాళాలు వసూలు చేసి కార్యాలయానికి పంపారు. కోటి రూపాయల విలువైన ఆ వంతెన అంచనాలను 3 కోట్లకు పెంచుకున్నారు మంత్రివర్యులు. ఇక నియోజకవర్గంలో వేసిన రోడ్లు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణాలకు మంత్రి తీసుకున్న కమీషన్లక కొదవేలేదు. పట్టణంలో ఓ సంస్థ 85 కోట్ల రూపాయలతో నీటి పథకం విస్తరణ పనులు చేపట్టింది. పనులు సాగాలంటే 5 కోట్లు ఇవ్వాలని గుత్తేదారు సంస్థను డిమాండ్ చేశారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆగ్రహించిన మంత్రి బిల్లులు రానీయకుండా వేధింపులకు గురిచేశారు.
పట్టణంలో 35 కోట్ల రూపాయలతో ఓ సంస్థ చేపట్టిన అంతర్గత తాగునీటి పైపులైన్ల పనులూ మంత్రి కార్యాలయ ఒత్తిడితోనే నిలిచి పోయాయి. నియోజకవర్గంలో జూదం క్లబ్‌లనూ ప్రోత్సహించారు ఆ మంత్రి. పోలీసులు అటువైపు రాకుండా ఆయన చూసుకునేవారు. అందుకు గాను క్లబ్‌ల నుంచి నెలకు 5 లక్షల కమీషన్ పుచ్చుకునేవారు. తన నియోజకవర్గంలో 5.3 ఎకరాల స్థలం ఉన్న ఓ వ్యక్తి మృతి చెందారు. ఆస్తుల విషయంలో జడ్జి తల్లికి, జడ్జి భార్యకు మధ్య విభేదాలు వచ్చాయి. ఇందులో జోక్యం చేసుకున్న ప్రజాప్రతినిధి అందులోని ఎకరం 30 సెట్లను తన అనుచరుడికి కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం న్యాయస్థానం వరకూ వెళ్లింది. జడ్జి ఆస్తికే రక్షణ లేకుండా పోయిందని అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి.
బినామీ పేరిట మంత్రి కబ్జా : తీర ప్రాంతంలోని 40 ఎకరాల్ని బినామీ పేరిట మంత్రి కబ్జా చేశారని, వాటికి పట్టాదారు పాస్‌పుస్తకాలూ జారీ అయ్యాయనే ఆరోపణలున్నాయి. మాజీ సీఎంను నిత్యం తిట్టాలంటూ ప్రోత్సహించే జగన్ ఆశీస్సులతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి ఆ శాఖలోని ప్రతి అధికారికీ లక్ష్యాలు పెట్టి మరీ వసూళ్లకు తెరలేపారు. 2009లో మొదటిసారిగా ఒక నియోజకవర్గం నుంచి, 2014లో మరో నియోజకవర్గం, 2019లో తిరిగి మొదటి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 2024లో మరో కొత్త నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. కొత్త నియోజకవర్గంలోనూ అప్పుడే ఇసుక దందా మొదలుపెట్టారు.! ఎన్నికల విరాళాలు అంటూ స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్లు, గుత్తేదారులు, పారిశ్రామికవేత్తల నుంచి కోట్లు వసూలు చేస్తున్నారు.! ఇదెక్కడి తగలాటకం అంటూ వ్యాపారవర్గాలు బెంబేలెత్తుతున్నాయి.
ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ - సీట్ల సర్దుబాటుపై కుదిరిన అవగాహన
ఏపీలో ఎన్నికలు ఏకపక్షమే - టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది- చంద్రబాబు