Union Minister Piyush Goyal Launch Turmeric Board : నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.
అనంతరం కేంద్రమంత్రి పీయూష్ మాట్లాడుతూ సంక్రాంతి రోజున నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రపంచంలో భారత్‌కు గొప్ప పేరు ఉందని, నాణ్యమైన పంట పండించేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. ప్రధాని మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని, ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు. తొలి ఛైర్మన్‌గా నియమితులైన గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
పసుపు బోర్డు రావడం సంతోషంగా ఉంది : పండుగ రోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. గతంలో చాలా మంది పసుపు బోర్డు గురించి మాట్లాడి సాధించలేదన్నారు. తెలంగాణ ప్రజల తరపున కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ మాట ఇచ్చిన విధంగా తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేశారన్నారు.
పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దీంతో పసుపు బోర్డుకు ఛైర్మన్‌గా బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది.
"సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు మంజూరు చేశాం. పసుపు బోర్డుకు తొలి ఛైర్మన్‌గా నియమితులైన గంగారెడ్డికి శుభాకాంక్షలు. ప్రపంచంలో భారత్‌కు గొప్ప పేరు ఉంది. నాణ్యమైన పంట పండించేలా రైతులను ప్రోత్సహిస్తాం. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు." -పీయూస్ గోయల్, కేంద్రమంత్రి