Crackers Bike Stunt In Hyderabad : రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సంబురాలు ప్రజలు సంబరంగా జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా, నరకాసురుడిని సత్యభామ వధించిన గెలుపునకు గుర్తుగా ఇలా పలు విధాల జరుపుకునే దివ్వెల వేడుకలు ఘనంగా సాగాయి.
బాణాసంచా కాలుస్తూ బైక్‌లపై విన్యాసాలు : కానీ దీపావళి పండుగ రోజున హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో కొందరు ఆకతాయిలు ఇష్టారీతిన బాణాసంచా కాలుస్తూ, బైక్‌లపై విన్యాసాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీనిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వీడియోలు ట్విటర్లో షేర్ చేశారు. 'పండుగ పూట ఇదేం వికృతానందం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు యువకుల తీరును తప్పుబడుతున్నారు. సరదాల కోసం రోడ్లపై ఇలా ప్రమాదకర స్టంట్లు చేయడం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
‘దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోంది సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం?’ -సజ్జనార్, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ
దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024
దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం.
పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR
హైదరాబాద్‌లో బైక్ రేసులు : నగరంలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో రోడ్లపై రకరకాల స్టంట్లు చేస్తున్నారు. వారాంతపు సెలవులు వస్తే చాలు అర్ధరాత్రి హైదరాబాద్‌లో లాంగ్ డ్రైవ్స్, నైట్ రైడ్స్ అంటూ కొంతమంది యువకులు నానా హంగామా చేస్తున్నారు. బైకులపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ వాళ్ల ప్రాణాలతో పాటు ఎదుటి వారికీ ముప్పు తెస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాత్రిపూట బైక్ రేసింగ్‌లు ఎక్కువవుతున్నాయి. మితిమీరిన వేగంతో బైక్ రేసింగ్‌లు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. వీటివల్ల సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు.