TTD Arranged Information Centers for Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తెలగురాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, లడ్డూ కౌంటర్లు, వసతి, వాహన సేవలు, స్థానిక ఆలయాలు, రవాణా వసతులపై సమాచారం ఎంతో కీలకం. ఈ మేరకు టీటీడీ ఆధ్వర్యంలో ఐదు సమాచార కేంద్రాలు, అదనంగా మరో ఏడు కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
తిరుమలలోని జీఎన్‌సీ, ప్రధాన కల్యాణకట్ట, భజనమందిరం, సీఆర్వో ఏటీసీ సమాచార కేంద్రాలతోపాటు అదనంగా పీఏసీ2, వీజీవో కార్యాలయ సమీపంలో, రాంభగీచా అతిథిగృహం, మ్యూజియం వద్ద, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా టీటీడీకి సంబంధించిన సమాచారాన్ని కరపత్రాల్లోని ముద్రించి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా సమాచార కేంద్ర సిబ్బంది కూడా భక్తలు మాట్లాడే భాషలోనే వారికి సమాచారం ఇస్తారు. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షించనున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అధికారులు విస్తృత ఏర్పాటు చేపట్టారు. గతేడాది అధికమాసం కారణంగా సెప్టెంబర్, అక్టోబర్‌లో సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగాయి. గత బ్రహ్మోత్సవాలకు మిన్నగా భక్తుల కోసం టీటీడీ మెరుగైన సదుపాయాలను తీసుకువచ్చింది. 2023లో రెండు రెండు బ్రహ్మోత్సవాలు కలిపి సుమారు 11 లక్షల మంది భక్తలు దర్శించుకున్నారు. హుండీ కానుకలు సైతం రూ.47.55 కోట్లు లభించాయి. 57,63,360 లడ్డూలు విక్రయించారు.
చిన్నారులు, వృద్ధుల కోసం జియో ట్యాగింగ్
టీటీడీ భద్రతా, నిఘా విభాగం నుంచి 1,250 మంది, పోలీసు శాఖ నుంచి 3 వేల 900 మంది సిబ్బందిని నియమించారు. గరుడ సేవకు అదనంగా 1,200 మందితో భద్రత కల్పించనున్నారు. చిన్నారులు, వృద్ధులు తప్పిపోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జియోట్యాగింగ్ చేయనున్నారు. ఎవరైనా తప్పిపోయినా సకాలంలో గుర్తించే అవకాశం ఉంటుంది.
ప్రత్యేకంగా కాల్ సెంటర్ : భక్తుల నుంచి ఎప్పటికప్పుడు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు. భక్తులు ఏమైన భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్ ఫ్రీ నంబరు 155257కు ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా బ్రహ్మోత్సవాల సమస్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తమ సూచనలు, సలహాలు టీటీడీ మెయిల్ helpdesk.ttd@tirumala.orgకు పంపవచ్చు.
ట్రాఫిక్ నిబంధనలు : ట్యాక్సీలు, వాహనదారులను ఈ నెల 4 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు, 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో జీఎన్‌సీ సర్కిల్ నుంచి తిరువెంకటపతం ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా పీఏసీ-111 కూడలిలో యాత్రికులను దించి తిరుపతి వెళ్లాలి. తిరుమల లోపలకు అయితే అనుమతించరు. ఈ నెల 8న గరుడసేవ ఉన్నందున 7వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు తిరుమలకు ట్యాక్సీలు అనుమతించరు.
తిరుమలలో అడ్డంకులు తొలగించి : ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలను తిరుమల ట్రాఫిక్ పోలీసులు సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. వీటిని బాంబ్ స్క్వాడ్ టీమ్‌లతోనూ చెక్ చేయించారు.