Thermal Power Plant in Ramagundam : విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణి ఫోకస్ పెట్టింది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏటా డిమాండ్ పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం రామగుండంలో ఉన్న జెన్‌కోకు చెందిన పాత 62.5 మెగావాట్ల థర్మల్ కేంద్రాన్ని (Ramagundam Thermal Power Plant) తమకు అప్పగిస్తే దాన్ని తొలగించి, అదే స్థలంలో రూ.10,000ల కోట్ల పెట్టుబడితో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మిస్తామని తెలంగాణ సర్కార్‌కు ప్రతిపాదించింది.
Singareni Focus on Power Generation : రామగుండంలోని పాత ప్లాంట్‌ను నిర్మించి 50 సంవత్సరాలు దాటింది. దాన్ని వెంటనే మూసివేయాలని జెన్‌కో సాంకేతిక నిపుణుల బృందం ఆరు నెలల క్రితమే సిఫార్సు చేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఈ ప్లాంట్‌పై జెన్‌కోకు ఇప్పటికే రూ.160 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి. ఒకవేళ దీన్ని మూసివేస్తే అక్కడున్న 250 ఎకరాల స్థలం తమకు అప్పగించాలని సింగరేణి కోరింది. ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
పట్టువిడవని యువఇంజినీర్లు- సొంత పవర్ ప్లాంట్ నిర్మాణం, ప్రభుత్వానికే కరెంట్ అమ్మకం
జైపూర్‌లో మరో రెండు ప్లాంట్లు!: మరోవైపు సింగరేణికి ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1,200 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఉంది. అక్కడున్న ఖాళీ స్థలంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తోంది. అక్కడే మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కేంద్ర బొగ్గు శాఖ తాజాగా సింగరేణికి సూచనలు చేసింది. ఒకవేళ ఇది కూడా కార్యరూపం దాల్చితే సొంతంగానే 1,600 మెగావాట్ల ప్లాంట్లను జైపూర్‌లో నిర్మించాల్సి వస్తోంది. మరోవైపు, రామగుండంలోనూ మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మిస్తామంటూ సంస్థ ప్రతిపాదించింది. విద్యుత్ ఉత్పత్తిపై ఆదాయంతో పాటు అధిక లాభాలు వస్తుండటంతోనే థర్మల్ ప్లాంట్ల ఏర్పాటుపై సింగరేణి ముందుకెళ్లాలని యోచిస్తోంది.
800 మెగావాట్ల ప్లాంట్‌కు రూ.10,000ల కోట్ల పెట్టుబడి! : దేశంలో నూతన థర్మల్ కేంద్రం నిర్మాణానికి ఒక్కో మెగావాట్‌కు సగటున రూ.11 కోట్ల నుంచి రూ.12 కోట్ల వ్యయం అవుతోంది. 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మించాలంటే 300 ఎకరాలు కావాలి. రామగుండంలో 250 ఎకరాలే ఉండటంతో పక్కనే ఉన్న 50 ఎకరాల ప్రైవేట్ భూములను సింగరేణి సేకరించాల్సి వస్తుంది. ఈ ఖర్చులన్నీ కలిపితే 800 మెగావాట్ల ప్లాంటుకు దాదాపు రూ.10,000ల కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఇంజినీర్లు అంచనా వెేస్తున్నారు. జైపూర్‌లోనూ రెండు 800 మెగావాట్ల ప్లాంట్లకు మరో రూ.20,000ల కోట్ల పెట్టుబడి పెట్టాలి. ఇవన్నీ పూర్తయితే సౌర విద్యుత్ ప్లాంట్లతో కలిపి సింగరేణి సొంత విద్యుత్ కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 4,000ల మెగావాట్లు దాటుతుందని అంచనా. ప్రస్తుతం తెలంగాణ జెన్‌కో ప్లాంట్ల మొత్తం సామర్థ్యం కూడా ఇంతే ఉంది.
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రత్యేక పాలసీ : డిప్యూటీ సీఎం భట్టి