Tiger in Mancherial Forest : మంచిర్యాల జిల్లాలో జత, ఆవాసం కోసం మగ, ఆడ పులుల సంచారం ఎక్కువగా పెరిగింది. అవి జతకట్టడానికి అనుకూలమైన కాలం కావడంతో తరచూ పులులు అందుగులపేట అటవీ ప్రాంతానికి వస్తున్నాయి. ఇక్కడే గత రెండు నెలల క్రితం మగ పులి సంచరించగా, తాజాగా ఇప్పుడు ఆడ పులి కదలికలను జిల్లా అటవీ అధికారులు గుర్తించారు. ఆడ, మగ పులులు అడవి ప్రాంతంలోకి ఒకేదారిలో నడుస్తుండటంతో అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
అది ఆడపులే : మంచిర్యాల జిల్లాలోని ముత్యంపేట బీట్, లక్సెట్టిపేట రేంజ్లోని అందుగులపేట అడవుల్లో పెద్దపులులు ఎక్కువగా సంచరిస్తుండటంతో అటవీ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. మందమర్రి మండలం అందుగులపేటతో పాటు మేడారం అడవుల్లో ఆడ పులి కదలికలను గుర్తించారు. దీంతోపాటు మంగళవారం (డిసెంబరు17)న రాత్రి సీసీ కెమెరాల్లో ఆడపులి చిత్రాలు రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడికి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి నుంచి ఆడ పులి సంచరిస్తూ వచ్చిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజులు క్రితం ఇదే ప్రాంతంలో మగ పులి సైతం సంచరించింది. నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం వీటి ఆవాసానికి అనుకూలంగా ఉండటంతో పులుల సంచారం కాస్త పెరిగిందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
కెమెరాకు చిక్కిన పులి : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ర్యాలీ అటవీ ప్రాంతంలో పులి సంచారం అక్కడి స్థానికుల్లో కలకలం రేపుతోంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలో పులి ఫొటోలు రికార్డయ్యాయి. పులి లక్షణాలను అంచనా వేయడానికి దాని పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు సేకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలంలో గుండాయిపేట శివారులో పెద్దపులి సంచారం అక్కడ వ్యవసాయం చేసుకునే ప్రజల్లో దడ పుట్టిస్తోంది. వ్యవసాయ చేనులో పెద్ద పులిని చూసిన గ్రామస్థుడు ఒక్కసారిగా తీవ్రమైన భయంతో పరుగులు తీశాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మళ్లీ పెద్దపులి కలకలం! : మరో పక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పులి కదలికలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అడవిరామారం అటవీ ప్రాంతంలో పులి పాదముద్రల కోసం గుండాల, కాచనపల్లి రేంజ్ అటవీశాఖ యంత్రాంగం గాలింపు చేపడుతున్నారు.
మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన చిరుత - హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
వరంగల్ అడవుల్లోకి పెద్దపులి - చాలా ఏళ్ల తర్వాత ఆనవాళ్లు