Wife Harassment On Husband : తన భార్య నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు. పెళ్లైనప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెమూజియన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియా ముందు తన గోడును విన్నవించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం : ఏపీలోని అమలాపురంకు చెందిన టెమూజియన్‌కు రాజోలుకు చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. మల్లారెడ్డి కళాశాలలో తాను ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పని చేస్తూ భార్యతో కలిసి అల్వాల్‌లో నివాసం ఉంటున్నట్లు బాధితుడు వివరించాడు. తమకు ఐదేళ్ల కుమారుడు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే పెళ్లైనప్పటి నుంచి భార్య తనను అకారణంగా హింసిస్తుందని ఆరోపించారు. పలుమార్లు పెద్దల సమక్షంలో ఆమెకు చెప్పించినప్పటికీ ఆమె తీరు మారలేదన్నారు.
ఇటీవల తనను చంపేందుకు తన భార్య కత్తితో దాడికి పాల్పడినట్లుగా బాధితుడు ఆరోపించాడు. ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం , పురుషులకు ఒక చట్టం ఉంటుందా? అని ప్రశ్నించారు. తాను నిన్నటి నుంచి ఇంటికి వెళ్లలేదని, వెళ్తే తన భార్య మళ్లీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నాడు.
"నాపేరు టెమూజియన్, నేను మల్లారెడ్డి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఏడేళ్ల క్రితం గౌతమి అనే అమ్మాయితో నాకు విహహం జరిగింది. వివాహం అయిన కొద్దిరోజులకే నాపై చిత్రహింసలు మొదలయ్యాయి. ఏదో విధంగా నన్ను మానసికంగా హింసిస్తుంది. కిచెన్ చాకుతో నాపై దాడికి పాల్పడింది. ఈ విధంగా నాపై పలుమార్లు దాడులకు పాల్పడుతుంది. దీనిపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను. తనకు నాతో కలిసి ఉండాలనే ఉద్దేశం లేదు. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను"- టెమూజియన్, బాధితుడు
కుటుంబ తగాదాలతో భర్త, అత్తపై దాడి చేయించిన కోడలు - Wife Attack on Husband
'నీ పెళ్లికి పెట్టిన ఖర్చులు తిరిగిచ్చేయ్' - అన్నా వదినల వేధింపులతో యువకుడి ఆత్మహత్య