Telangana Incharge Governor 2024 : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి ఎల్జీ (లెఫ్టినెంట్ గవర్నర్)గానూ ఆయనకు అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. దీంతో రాష్ట్రానికి వరుసగా మూడో తమిళ వ్యక్తి గవర్నర్‌గా నియమితులైనట్లు అయింది.
రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు ఉదయం 11.15 గంటలకు రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్ చేరుకున్నారు.
మరోవైపు తెలంగాణ గవర్నర్‌తో పాటు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించటం పట్ల ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనపై నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
లోక్‌సభ బరిలో తమిళిసై : తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి లోక్‌సభకు పోటీ చేసిన కరుణానిధి కుమార్తె కణిమొళిపై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమెను 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా భారత రాష్ట్రపతి నియమించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండో గవర్నర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2021 ఫిబ్రవరి 18వ తేదీ నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
'ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా' - గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పోటీ చేస్తారని ఎప్పట్నుంచో ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ బీజేపీ తరఫున మరోమారు పోటీ చేసేందుకు వీలుగా తమిళిసై రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ నెల 18న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆమె మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ పోటీ చేసే అవకాశం ఉంది.
ప్రజాకాంక్షలు నెరవేరేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది : గవర్నర్ తమిళిసై
రాజీనామా అనంతరం ఆమె తెలంగాణ నుంచి చెన్నై వెళ్లిపోయారు. 'ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పటికీ తెలంగాణ సోదరినే. నాపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.' అని చెన్నై వెళ్లే సందర్భంగా ఆమె తెలిపారు.]
'మా భవిష్యత్తు, జీవితాలు నాశనం చేశారు'- తమిళిసైకి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ