TG HC order to Speed Up MLAs and MPs Cases : ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు దోషులుగా ఉన్న కేసుల్లో విచారణ జరుగుతున్న తీరుపై తెలంగాణ హైకోర్టు బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత నెల విచారణ నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం పురోగతి లేకుండా, ఎక్కడి కేసులు అక్కడే అలానే ఉండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితులకు, సాక్షులకు సమన్లు జారీ చేయడంలో జాప్యమెందుకు జరుగుతోందని ప్రశ్నించింది.
నెల రోజుల్లో కేవలం 9 సమన్లు మాత్రమే జారీ చేస్తారా అని ప్రశ్నించింది. కళ్లెదుటే తిరుగుతున్నా సమన్లు ఎందుకు జారీ చేయడం లేదని నిలదీసింది. ఈ మేరకు నిందితులకు, సాక్షులకు సమన్ల జారీకి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను జులై 23కు వాయిదా వేసింది. భారత సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై ఈ అంశాన్ని సుమోటో పిటిషన్‌గా స్వీకరించిన విషయం విదితమే.
రాష్ట్రవ్యాప్తంగా 115 కేసులు పెండింగ్‌లో : ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో హైకోర్టు రిజిస్ట్రీ తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ హైకోర్టుకు స్థాయీనివేదిక ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 115 కేసులు నేతలపై పెండింగ్‌లో ఉన్నట్లు రిజిస్ట్రీ ఆ నివేదికలో పేర్కొంది. మరోవైపు 46 సమన్లు జారీ చేయాల్సి ఉందని తెలిపింది.
ఆ నివేదిక పరిశీలించిన ధర్మాసనం, కేసుల విచారణలో ఎలాంటి పురోగతి లేదని ప్రశ్నించింది. ఈ క్రమంలో అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ జోక్యం చేసుకుంటూ సమన్ల జారీలో ఎందుకు జాప్యం జరుగుతుందో వివరాలు తెలుకుంటామని బదులిచ్చారు. వెంటనే జారీ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను జులై 23కు వాయిదా వేస్తూ కేసుల్లో నిందితులకు, సాక్షులకు సమన్ల జారీ చేయాలని, దానిపై పురోగతి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.