High Court Rejects Postponement of Group-1 Exam : గ్రూపు-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ను వాయిదా వేయడానికి హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ఈ నెల 9న జరిగే ఈ ప్రిలిమ్స్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. జూన్ 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్-1 పరీక్షను మరో తేదీకి మార్చాలని ఎం.గణేశ్, భూక్యా భరత్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ జరిపారు.
టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, రాష్ట్రంలో రెండు ఇంటెలిజెన్స్ పోస్టులకు 700 మంది అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకున్నారని, గ్రూప్-1కు 4 లక్షల మందికి పైగా ఆశావహులు పోటీపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే వారంతా హాల్‌టికెట్లను సైతం డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. కొంత మంది కోసం లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన జడ్జి ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయడానికి నిరాకరించారు. ఈ నెల 1న పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి టీజీపీఎస్సీ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.
గ్రూప్స్ పరీక్షలకు అడుగడుగునా అడ్డంకులే : అసలే గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలరీత్యా పలుమార్లు పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ, ఉత్కంఠలకు తెర దించుతూ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ను ఇటీవలే రేవంత్ సర్కార్‌లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. జూన్‌లో ప్రిలిమ్స్, సెప్టెంబరు- అక్టోబరులో మెయిన్స్ పరీక్షలు అని షెడ్యూల్ కూడా వెల్లడించింది. ఇక గ్రూప్స్ పరీక్షలకు ఏ అడ్డంకులు లేనట్లేనని నిరుద్యోగులు భావిస్తున్న సమయంలో, ఓ ఇద్దరు వ్యక్తులు వేసిన పిటిషన్ ఒక్కసారి హాట్‌టాపిక్‌గా మారింది. కానీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఇప్పటికే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినందున వాయిదా వేయలేమని తీర్పు వెలువరించడం నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లలో స్వల్పమార్పులు - ఏంటంటే