Telangana Govt Focus On Drugs In Hyderabad : రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుబడినప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్ది దాని వెనుక ఎంతో మంది పాత్ర వెలుగుచూస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకేసారి రూ. 7 కోట్ల విలువైన హెరాయిన్ నగరానికి ఒకేసారి తీసుకురావడమన్నదే చర్చనీయాంశంగా మారింది. కచ్చితంగా కొనుగోలుదారులు తీసుకుంటారనే ఉద్దేశంతోనే మత్తు పదార్ధాలు నగరానికి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకొచ్చిన ముఠాలోని నలుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరిలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసముండే కిరాణ దుకాణం యజమాని అజయ్ భాటి కూడా ఉన్నాడు. ఇతని ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ చేరుతున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ మాఫియా : రాజస్థాన్‌లో ఉండే నేమిచంద్ భాటి తన సహాయకుడితో ప్రైవేటు బస్సుల ద్వారా అజయ్ భాటికి డ్రగ్స్ పంపిస్తున్నాడు. ఈ గొలుసుకట్టు దృష్ట్యా అజయ్ భాటి నగరంలోని ఇతర డ్రగ్ సరఫరాదారులు లేదా మరి కొందరు వ్యక్తులు డిమాండ్ మేరకే తెచ్చి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ఈ నేపథ్యంలోనే నిందితుల కాల్ రికార్డు, నగరంలో వారి పరిచయస్థులు, వినియోగదారులు సహా సాంకేతిక సమాచారాన్ని లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నగరంలో కొందరు వీరిని కొందరు సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. నిందితుల్ని కస్టడీకి తీసుకుంటే నగరంలోని డ్రగ్స్ సరఫరాదారుల లింకు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
పబ్బులో డ్రగ్స్ కేసులు : గత రెండు నెలలుగా నగరంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులు నాలుగింట్లోనూ పబ్బుల పాత్ర బయటపడింది. కేవ్ పబ్బులో డ్రగ్స్ తీసుకునే వారి కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి మేనేజర్, ఇద్దరు సహా మరికొందరు పోలీసులకు చిక్కారు. ఇటీవల అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ దగ్గర మత్తుపదార్థం కొంటున్న వారిలో పబ్బు యజమాని ఉన్నారు.
మాదాపూర్‌లోని పబ్బులో ఒక డీజే మాదకద్రవ్యాలు తీసుకుని పోలీసులకు దొరికాడు. ఇలా నగరంలో సంచలనం రేపిన ఎన్నో కేసుల్లో ఏదో ఒక రూపంలో పబ్బులు కేంద్ర బిందువుగా ఉంటున్నాయి. తాజాగా కిలో హెరాయిన్ పట్టుబడ్డ కేసులోనూ నిందితులు పబ్బు మేనేజర్ల ప్రస్తావన తెచ్చారు. వరుస ఉదంతాల నేపథ్యంలో పబ్బులపై నిఘా పెంచి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఆగడాలకు కొంతైనా అడ్డుకట్ట వేయవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు.