55 KM Flyover between Hyderabad and Srisailam : శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్డు మార్గం ద్వారా వెళ్లడమంటే కష్టంగా ఉండేది. ఎందుకంటే హైదరాబాద్ దాటగానే చుట్టూ దట్టమైన నల్లమల అడవిలో ప్రయాణం చేయాలి. కానీ వాహన వేగం మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్లు దాటకూడదు. ఒకవేళ వాహన వేగం పెరిగితే జరిమానాలు చెల్లించాల్సిందే. పైగా అన్ని వేళల్లో ఆ మార్గంలో వెళ్లడానికి అవకాశం లేదు. రాత్రివేళల్లో ప్రయాణం పూర్తిగా నిషేధం. పైగా సొంత వాహనాల్లో వెళ్లాలంటే వన్యప్రాణుల భయం. ఇలాంటి సమస్యల నుంచి భక్తులకు, ప్రకృతి ప్రియులకు ఉపశమనం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. అదే 55 కిలోమీటర్ల పొడవైన భారీ వంతెన.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చితే మన్ననూరు చెక్‌పోస్టు నుంచి ఏకంగా ఈ 55 కిలోమీటర్ల వంతెన ద్వారా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లవచ్చు. అది కూడా దట్టమైన అడువుల అందాలను వీక్షిస్తూ, ప్రకృతి ఇచ్చే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ నేరుగా శ్రీశైలం చేరుకోవచ్చు. పైగా ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. అంతే కాందడోయ్. వాహన వేగంపై ఉన్న ఆంక్షలూ తొలగించే ఛాన్స్ చాలా ఎక్కువ.
తెలంగాణ, ఏపీకి అత్యంత కీలకమైన మార్గం : హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల జాతీయ రహదారి నంబరు 765 తెలంగాణ, ఏపీ మధ్య అత్యంత కీలకమైన రహదారి. ఈ రహదారి మీదుగానే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. ఈ రోడ్డు తుక్కుగూడ, ఆమనగల్లు, డిండి, మన్ననూరు మీదుగా పోతుంది. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లి రావడానికి కూడా ఈ రోడ్డే ప్రధానం. ఈ రహదారిపై శుక్ర, శని, ఆదివారాల్లో హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో ఏడు వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అంచనా. ముఖ్యంగా ఈ హైవే ఎక్కువగా నల్లమల అటవీ ప్రాంతం మధ్యలో నుంచి వెళుతుంది.
ఈ మార్గమధ్యలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఉండటం, పెద్ద పులులు, ఇతర వన్య ప్రాణుల సంచారం ఎక్కువ. అందుకే ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు గతంలో ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. ఈ మార్గంలోని హైవేలో ఏకంగా 55 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మించేలా రాష్ట్ర ఆర్ అండ్ బీ అధికారులు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. వాటిని వారం రోజుల క్రితం కేంద్ర ఉపరితల రవాణా శాఖకు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి సమర్పించారు.
ఓ వైపు ఘాట్ రోడ్డు, మరోవైపు దట్టమైన అడవి : హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో ఘాట్ రోడ్డు మొదలయ్యే ప్రాంతం నుంచి ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రతిపాదించారు. అంటే మన్ననూరు చెక్పోస్తుకు ముందున్న బ్రాహ్మణపల్లి నుంచే కారిడార్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత దోమలపెంట తర్వాత వచ్చే పాతాళగంగ (తెలంగాణ సరిహద్దు) వద్ద ముగిసేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ కారిడార్ ఘాట్ రోడ్డులో దట్టమైన అమ్రాబాద్ అభయారణ్యం మీదుగా సాగుతుంది. జనావాసాలు ఉన్న మన్ననూరు, దోమలపెంటల బైపాస్‌లను, మూలమలుపులు ఉన్న చోట నేరుగా వంతెన వెళ్లేలా ప్రతిపాదనలు పంపారు.
ఈ ప్రతిపాదన సాకారం అయితే 55 కిలోమీటర్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద వంతెన అవుతుంది. దీని నిర్మాణానికి అంచనా వ్యయం రూ.7 వేల కోట్లు. మన్ననూరు-ఫర్హాబాద్ జంగిల్ సఫారీ-వటవర్లపల్లి-దోమలపెంట మీదుగా ఎలివేటర్ కారిడార్ సాగనుంది. కేంద్రం ఆమోదం రాగానే డీపీఆర్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఇలాంటి కారిడార్‌నే పాతాళగంగ నుంచి శ్రీశైలం వరకు ఏపీ ప్రభుత్వం ఎలైన్మెంట్ రూపొందించినట్లు సమాచారం.
ఆ భూమి మాదంటే మాదే అంటున్న శ్రీశైలం దేవస్థానం- అటవీశాఖ అధికారులు! - Srisailam Temple Land Disputes