TAMIL MARRIAGE AGREEMENT : పెళ్లి అనగానే ఎగిరి గంతేస్తారు కొంత మంది. ''అయ్యో! అప్పుడే పెళ్లా'' అని మొహం చాటేస్తారు ఇంకొంత మంది. బ్యాచిలర్ లైఫ్, స్నేహితులు, జాలీ ట్రిప్పులు, విందులు, వినోదాలకు ఇక ఫుల్స్టాప్ పెట్టాల్సిందేనా! అనే ఆందోళన అందుకు ప్రధాన కారణం. పెళ్లి కుదరడమే తరువాయి.. చాలా మంది యువకులు స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చేస్తుంటారు. ఇదిలా ఉంటే స్నేహితులు ఇచ్చే పెళ్లి కానుకలు కూడా తరచూ వార్తల్లోకెక్కడం గమనించే ఉంటాం. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ పెళ్లిలో జరిగిన ఘటన వైరల్‌గా మారింది.
పెళ్లికి ముందు ఉండే స్వేచ్ఛ అంతా ఇంతా కాదంటున్నారు యువకులు. వేళకు ఇంటికి రావాల్సిన అవసరం లేదని, ఎక్కడికి వెళ్లినా అడిగే వారే ఉండరని, స్నేహితులతో పార్టీలు, టూర్లు ఉంటాయని చెప్తున్నారు. ఇక పెళ్లయితే చాలు.. స్వేచ్ఛ కోల్పోయినట్లుగా అనిపిస్తుందని పెళ్లయిన యువకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ పని చేసినా భార్యతో చెప్పాల్సి ఉంటుందని, ఆఫీసులో కాస్త ఆలస్యమైనా ఇంటికి వచ్చాక వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఉందని వాపోతున్నారు. ముఖ్యంగా స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండాల్సి వస్తోందని, లైఫ్ బోర్ కొడుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ పెళ్లికి హాజరైన వరుడి స్నేహితులు వినూత్నంగా ఆలోచించడం వైరల్‌గా మారింది.
పెళ్లయిన తర్వాత కూడా తన భర్తకు పూర్తి స్వేచ్ఛనిస్తానని, అడ్డు చెప్పనని వధువుతో స్టాంప్ పేపర్‌పై సంతకం చేయించడంతో పాటు ప్రమాణం చేయించారు వరుడి స్నేహితులు. తమిళనాడులోని మైలాడుదురై జిల్లా సీర్గాళి సమీప తెన్‌పాడికి చెందిన ముత్తుకుమార్‌కు కురింజిపాడికి చెందిన పవిత్రతో ఈ నెల 16న వివాహమైంది. కార్యక్రమానికి హాజరైన వరుడి స్నేహితులు.. రూ.100 స్టాంప్ పేపర్ తీసుకొచ్చారు. పెళ్లయిన తరువాత స్నేహితులతో ఆనందంగా సమయం గడపడానికి ఒప్పుకొంటున్నానని, వారితో విహారయాత్రలకు వెళ్లకుండా అడ్డు చెప్పబోనని వధువు చెబుతున్నట్లు రాశారు. ఆమెకు ఆ స్టాంప్ పేపర్ గురించి వివరించి సంతకం పెట్టించుకున్నారు. ఆమె కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సంతోషంగా సంతకం చేయడంతో పెళ్లికొడుకు ఆనందం అంతా ఇంతా కాదు. తన మిత్రులు ఇచ్చిన కానుకతో అతడు మురిసిపోయాడు.