Storm Crossed to Chennai Cost Today : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ పుదుచ్చేరి, నెల్లూరు మధ్యలో చెన్నై సమీపంలో తీరం దాటింది. చెన్నై-నెల్లూరు మధ్య తడ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కి.మీ. వేగంతో వాయుగుండం తీరాన్ని దాటింది. ప్రస్తుతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం సాయంత్రం ఐదున్నర సమయంలో వాయుగుండం చైన్నెకి 190 కి.మీ, పుదుచ్చేరికి 250 కి.మీ, నెల్లూరుకు 270 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, వాడరేవు, మచిలీపట్నం వరకు పోర్టులకు మూడో నంబరు, గంగవరం, కాకినాడ, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. తీరం దాటిన త్వరాత దక్షిణ కోస్తా, పరిసర తమిళనాడు ప్రాంతాలవైపు కదులుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని తెలిపారు.
వరదలు సైతం వచ్చే ప్రమాదం : శ్రీసత్యసాయి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీపొట్టిశ్రీరాములు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సైతం వచ్చే ప్రమాదముందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా తిరుపతి జిల్లాలో ఏర్పేడులో 9.7 సెం.మీ.వర్షం కురిసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో 8.2 సెం.మీ.వర్షం కురిసింది. రేణిగుంటలో 7, వెంకటగిరిలో 6.8 సెం.మీ.వర్షపాతం నమోదైంది.
వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే :
- దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
- నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలకు వర్ష సూచనలు
- తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల తీరప్రాంతాల్లో ఈదురుగాలులు
- తీరప్రాంతాల్లో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
- తీరం మధ్యాహ్నం వరకూ అలజడిగానే ఉంటుందన్న ఐఎండీ
- కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం
- చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో వాగులు, వంకల్లో ఆకస్మిక వరదలకు అవకాశం
- ప్రస్తుతం విశాఖ, గంగవరం పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక
- నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సముద్రపు అలలు ఎగిసిపడతాయని హెచ్చరికలు
- అలలు 1.5 మీటర్ల ఎత్తున ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు
- ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో అలలు ఎగిసిపడతాయని హెచ్చరికలు
- గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అలలు ఎగిసిపడతాయని హెచ్చరికలు
ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు : ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశముందని వివిధ వాతావరణ నమూనాలు అంచనా వేశాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల 21న అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇది వాయవ్య దిశగా పయనించి ఈ నెల 24 నాటికి ఒడిశా తీరానికి చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది బలపడి తీవ్ర తుపానుగా బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటొచ్చనే అంచనాలు సైతం ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఈ నెలాఖరున మరో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది ఈ నెల 24న ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించి, 25 నాటికి అల్పపీడనంగా మారే అవకాశముందని అంచనా వేసింది. ఈ నెల 26 నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావం ఏపీపై పెద్దగా ఉండకపోవచ్చని, కానీ వర్షాలు మాత్రం విస్తారంగా కురుస్తాయని ఐఎండీ మాజీ శాస్త్రవేత్త డా.కేజే రమేశ్ తెలిపారు. వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడితే తీవ్రత పెరిగే అవకాశం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.