Govt Special Focus On Food Processing : రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ ఆహార శుద్ధి రంగం(ఫుడ్ ప్రాసెసింగ్) అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం విస్తృత కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో మెగా ఫుడ్ పార్కు అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేయనుంది. సువిశాల 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.109.59 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ప్రాజెక్టుకు గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.
Minister Thummala Orders On Food Processing : ఈ మెగా ఫుడ్ పార్కులో గత సర్కారు హాయంలో ప్రభుత్వ నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి కూడా ఎటువంటి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయలేకపోయింది. నిధులు వెచ్చించి వృథాగా ఉన్న ఈ మెగాఫుడ్ పార్కులో ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. రైతుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు వెంటనే చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నిరంతరం పర్యవేక్షించాలి : ఇప్పటికే కొంత మేర కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు, ప్యాకింగ్ హౌస్, గిడ్డంగులు, అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్‌లు, ట్రైనింగ్ సెంటర్, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, సైట్ డెవలప్మెంట్, కాంపౌండ్ వాల్, పవర్ సబ్‌స్టేషన్ మొదలైన వసతుల కల్పన పూర్తైంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రోత్సాహకం కరవై ఆగిపోయిన ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వైవిధ్యమైన ఉద్యాన పంటలు సాగులో ఉన్న దృష్ట్యా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వల్ల ఈ రెండు జిల్లాలకే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు, పక్క రాష్ట్రాల రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
యానిట్లు నెలకొల్పెందుకు సిద్ధమైన 6 కంపెనీలు : నిరూపయోగంగా ఉన్న పార్కును వినియోగంలోకి తీసుకొచ్చినట్లైతే వెచ్చించిన నిధులకు సార్థకత చేకూరుతుంది. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేయడం వల్ల ఆయా పంటలు సాగు చేసే రైతుల్లో విశ్వాసం పెరిగి, సాగు విస్తీర్ణం పెరగడం ద్వారా పంట మార్పిడి కూడా జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ యోచన. ఈ మెగాఫుడ్ పార్కులో ఆయిల్‌పాం, కొబ్బరి, కోకో, మామిడి పంటల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు సాగుతున్న తరుణంలో 6 కంపెనీలు యూనిట్లు నెలకొల్పడానికి ముందుకు రావడం శుభపరిణామం.
Advantages of Food Processing Units : ఆ ఫుడ్ పార్కులో ఖాళీగా ఉన్న ప్లాట్లు అద్దె ప్రాతిపదికన ఆహార శుద్ధి యూనిట్లు నెలకొల్పడానికి ముందుకు వచ్చే సంస్థలకు అనుమతుల మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయనుంది. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వల్ల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర దేశాలు, రాష్ట్రాల ఎగుమతులకు అవకాశాలు పెరుగుతాయి. పంట ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి రైతులకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఫుడ్ పార్కుల కోసం కేటాయించిన స్థలం సందర్శించి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
Modern Rice Mills Telangana : త్వరలోనే.. తెలంగాణలో అధునాతన రైస్ మిల్లులు
కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం : కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఉద్యాన శాఖలో అమలవుతున్న పథకాలైన ఆర్కేవీవై, ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పెన్షన్ ప్రొగ్రామ్, నేషనల్ బాంబూ మిషన్, సబ్ మిషన్ ఆన్ అగ్రో ఫారెస్టీ లాంటి పథకాలను గత ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇక నుంచి ఆయా పథకాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. నేషనల్ హార్టీకల్చర్ బోర్డ్ ద్వారా అమలు అవుతున్న హైటెక్ కమర్షియల్ హార్టికల్చర్ కోసం ఉత్పత్తి క్లస్టర్లు, హబ్‌లు, పంట కోత అనంతరం కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, కొత్త సాంకేతికలను ప్రోత్సహించడం లాంటి పనులు గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి - ఔత్సాహికులకు ప్రోత్సాహం