Srisailam Project Inflow : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం పాజెక్టుకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలానికి వరద ప్రవాహం పెరగడంతో, అధికారులు మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తిన అధికారులు, ఒక్కో గేటు నుంచి దాదాపు 27 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 879.90 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 182.60 టీఎంసీలుగా నీటి నిల్వ ఉంది. 6, 7, 8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తంగా 63,138 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. కర్నూలు చీఫ్ ఇంజినీర్ కబీర్ బాషా శ్రీశైలం గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేశారు.
మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల నుంచి 4,67,210 క్యూసెక్కుల వరద వస్తోంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 63,138 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.
Nagarjuna Sagar Water Flow : నాగార్జున సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నాలుగు రోజుల నుంచి వరద పోటెత్తుతోంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం- 590.00 అడుగులు కాగా, ప్రస్తుతం 512 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు కనిష్ట స్థాయి నీటిమట్టం 510 అడుగులు దాటింది. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుదుత్పాదక కేంద్రాల ద్వారా 55 వేల 605 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడంతో సాగర్ నీటిమట్టం క్రమంగా పెరిగింది. దీనికి తోడు ఇవాళ శ్రీశైలం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
వరద ప్రవాహంతో గోదావరి పరవళ్లు - నిండుకుండల్లా మారిన ప్రాజెక్టులు - Irrigation Projects in Telangana