Special Story on Nizamabad Taekwondo Coach : ప్రతిభ ఉంటే చాలు అవకాశాల కోసం వేచి చూడాల్సిన పనేం లేదంటున్నారు యువత. రాని నైపుణ్యాల కోసం తాపత్రయ పడకుండా, నచ్చిన, వచ్చిన వాటిలో ఎలా ప్రావీణ్యం సంపాదించాలో అన్వేషిస్తున్నారు. ఈ కుర్రాడి ఆలోచన విధానం కూడా అదే. చిన్నప్పుడే ఇష్టంగా నేర్చుకున్న తైక్వాండోలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. చిన్నారితో సునాయాసంగా పల్టీలు వేయిస్తున్న ఈ యువకుడి పేరు వినోద్ నాయక్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం లొంకతండా స్వస్థలం. చిన్నప్పటి నుంచే ఈ యువకుడు వివిధ క్రీడలలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. అప్పుడే సరదాగా తైక్వాండో నేర్చుకున్న వినోద్ అంతర్జాతీయ టోర్నమెంట్లలో సత్తా చాటుతున్నాడు.
పేదరికంతో ఇబ్బందులు పడినా తైక్వాండోపై మక్కువతో అన్నీ అధిగమించాడు వినోద్. నిరంతరం శ్రమిస్తూ పట్టుదలతో ముందుకుసాగాడు. పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యాడు. అక్కడ బీటెక్ చదువుతునే వీలు దొరికినప్పుడల్లా తైక్వాండో పోటీల్లో పాల్గొనేవాడు. చదువుకుంటున్నప్పుడే వివిధ క్రీడలలో పతకాలు సాధించడంతో వినోద్‌లో ఆత్మవిశ్వాసం మరింత బలపడింది. ఆ సమయంలో స్థానిక కోచ్ సలహా మేరకు తైక్వాండోలో చేరి శిక్షణ తీసుకున్నాడు. అప్పటి నుంచి సాధన చేస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తున్నాడు.
దేశానికి బంగారు పతకం తేవడమే లక్ష్యం : దేశం తరపున నాలుగు సార్లు అంతర్జాతీయ తైక్వాండో క్రీడకు ప్రాతినిత్యం వహించాడు వినోద్. దిల్లీ, దుబాయ్ వేదికగా జరిగిన టోర్నమెంటులో సత్తా చాటాడు. ఇటీవల థాయిలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో రజతపతకం సాధించాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో 20 పైగా పతకాలు సొంతం చేసుకున్నాడు. కొరియాలో జరగబోయే తైక్వాండో పోటీల్లో బంగారు పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నానని చెబుతున్నాడు. తనలాంటి వారిని ప్రోత్సహించేందుకు తైక్వాండో అకాడమీని స్థాపించాడు ఈ యువకుడు. అందులో 300 మందికి పైగా శిక్షణ పొందుతున్నారు. వారిలో కొందరు బ్లాక్ బెల్ట్‌తో పాటు రాష్ట్ర, జాతీయ పతకాలు సాధించారు.
Yuva Story on Man Training on Taekwondo : అకాడమీ ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా తైక్వాండో నేర్పిస్తున్నాడు. తైక్వాండో నేర్చుకోవడం ద్వారా మనిషిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటున్నాడు వినోద్. ఆత్మరక్షణ కోసం ఈ క్రీడ ఎంతో ఉపయోగకరమని చెబుతున్నాడు. ముఖ్యంగా అమ్మాయిలు తైక్వాండో లాంటి యుద్ధవిద్యలో ప్రావీణ్యం సంపాధించాలని సూచిస్తున్నా డు. అకాడమీ ద్వారా శిక్షణ ఇస్తూనే అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో బంగారు పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు వినోద్. ద్విపాత్రాభినయం చేస్తున్న వినోద్ స్వర్ణం సాధించాలని కుటుంబసభ్యులంతా కోరుకుంటున్నారు.
స్పోర్ట్స్‌లో ఆసక్తి ఉండడం వల్ల కాలేజీ తరఫున ఆటలు ఆడేవాడిని. అక్కడ ఓ కోచ్ పరిచయం అయ్యి తైక్వాండోలో జాయిన్ అయ్యా.'-వినోద్ నాయక్, తైక్వాండో క్రీడాకారుడు
శెభాష్ హిమబిందు - 10 ఏళ్లు కష్టపడి 5 సర్కార్ కొలువులు సాధించిన గృహిణి
సర్కారు కొలువే లక్ష్యంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం - కోచింగ్ లేకుండా ప్రతిభ చూపిన గజ్వేల్ బిడ్డ