Special Story on Happy Daughters Day 2024 : ముచ్చెర్ల అరుణ. అలనాటి సీతాకోక చిలుక సినిమాలో తన యాక్టింగ్‌తో సంచలనం సృష్టించింది. డాన్సర్‌గా, నటిగా, గృహిణిగా, నలుగురు ఆడపిల్లలకు అమ్మగానే కాకుండా, సోషల్ మీడియాలో మామ్గానూ లక్షల మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అలా సరికొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. డాటర్స్ డే సందర్భంగా ఈటీవీ భారత్‌తో ముచ్చటించారు.
సినిమా రంగంలో ఉన్నది దశాబ్ద కాలమే కానీ, దాదాపు డెబ్భైకి పైగా చిత్రాల్లో నటించానని ఆమె తెలిపారు. ఇవి జీవిత కాలానికి సరిపడా సంతోషాన్నీ, అనుభవాన్ని ఇచ్చాయని అన్నారు. అత్తింటి వారి అభిప్రాయాన్ని ఏకీభవించి పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యారని చెప్పారు. తమ స్వస్థలం తెలంగాణలోని కొత్తగూడెమని, సినిమాల్లోకి వచ్చాక చెన్నైలో స్థిరపడ్డామని తెలిపారు. 1987 ప్రేమ వివాహం చేసుకున్నామని, తన భర్త ఉత్తరాదికి చెందిన వారని వివరించారు.
"మాకు నలుగురు ఆడపిల్లలు. అమ్మాయి పుట్టిందనగానే మహాలక్ష్మి రూపమనో, ఝాన్సీ రాణితోనో పోల్చుకుంటే సరికదా! అలా అనరు. ‘అయ్యో అమ్మాయా’ అంటారు. మా అత్తగారైతే, మా వారితో ‘ఒక్కడైనా మగపిల్లాడు లేకపోతే వంశమే లేకుండా పోతుంది’ అని పోరు పెట్టారు. అందుకోసమే బాబు పుట్టాలని నాలుగు కాన్పులు ఆగా. అన్నీ సిజేరియన్లే. ఒక్కడైనా మగపిల్లాడు ఉంటే బాగుండును అంటూ తరచూ అసంతృప్తి వెళ్లగక్కేవారు." - ముచ్చెర్ల అరుణ
సితారకు మహేశ్ స్పెషల్ విషెస్.. తన ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుందంటూ.
వాళ్లకి ఏ అంశాల్లోనూ ఆంక్షలు పెట్టను : 'ఇప్పటి కాలంలో కూడా అమ్మాయిలు, అబ్బాయిలు అన్న తేడాలేంటి. సముద్రాలు ఈదేస్తున్నారు, చంద్రమండలానికి వెళ్తున్నారు. మహిళాభివృద్ధి ఇంత ఉన్నా వారిపై దాడులు, అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ తల్లిగా నన్ను ఇది కలిచివేసింది. ఎవరేమనుకున్నా నేను, నా భర్త మా కుమార్తెలను మాకు కొండంత బలమని భావిస్తాం. పెద్దమ్మాయి శిఖా ఎంబీఏ, రెండో అమ్మాయి యాశ్వీ ఆర్కిటెక్ట్, మూడో పాప శోభిక లాయర్, అందరికంటే చిన్నది రియా డాక్టర్. వాళ్లు ఎలాంటి కెరియర్‌ని ఎంచుకోవాలన్న అవకాశం వారికే ఇచ్చాం. ఒక్క ఈ విషయంలోనే కాదు కట్టూ, బొట్టూ, ఇతర అంశాల్లోనూ ఆడపిల్లలనే ఆంక్షలేవీ పెట్టలేదు.
"అమ్మ చనిపోయాక నాకు కొంత ఉపశమనం ఉంటుందని మా అమ్మాయి అమెరికా రమ్మంటే వెళ్లా. ఓరోజు బట్టల్ని బాక్‌యార్డ్‌లో ఆరేశా. అక్కడలా చేయకూడదట. కానీ నేను వినలేదు. దాంతో సగటు భారతీయ మహిళలా నువ్వు చేసిన పని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతానంది. అన్నట్లుగానే చేస్తే అది వైరలైంది. ఆపై వాళ్ల సూచనతో నిత్య జీవితంలో నేనెలా ఉంటానో, ఆ సింపుల్ లైఫ్‌ని వీడియోలతో ప్రపంచానికి పరిచయం చేశా. మా చిన్నమ్మాయి తనకు వీలున్నప్పుడు షూట్ చేసి అప్‌లోడ్ చేస్తుంది." - ముచ్చెర్ల అరుణ
వారితో స్నేహితురాలిగానే ఉంటా : చాలా తక్కువ సమయంలోనే ఇన్‌స్టాలో పది లక్షలకు పైగా ఫాలోవర్లు వచ్చారు. మొదట్లో కేవలం పెద్దవాళ్లే చూస్తారని అనుకునేదాన్ని. కానీ ఈ మధ్య ఓ పద్దెనిమిదేళ్ల అమ్మాయి వచ్చి, మీ నుంచి స్ఫూర్తి పొందా అంటే సంతోషంగా అనిపించింది. నాకు సోషల్ మీడియా, టెక్నాలజీ గురించి ఏమీ తెలియదు. అన్నీ మా అమ్మాయిలే నేర్పిస్తుంటారు. నాకు సోషల్‌మీడియాలో బోలెడంత గుర్తింపొచ్చిందని, తిరిగి సినిమాల్లో నటించొచ్చు కదా’ అని అప్పుడప్పుడూ అడుగుతుంటారు. కానీ, నాకిది బాగానే ఉందని వారితో చెబుతుంటా. వారితో ఒక అమ్మగా కంటే, స్నేహితురాలిగా ఉండటానికే ఇష్టపడతా. వాళ్లూ అంతే. తమకెదురైన కష్టసుఖాలన్నీ పంచుకుంటారు. అందరూ ఆడపిల్లలే అని నన్ను చాలా మంది నిరుత్సాహపరచడానికి ప్రయత్నించారు కానీ, నేను మాత్రం తల్లిగా వారిని చూసి గర్వపడుతుంటా.' అని పంచుకున్నారు.