Son Kills Father For Marriage : పెళ్లి చేయడం లేదని కన్న తండ్రినే ఓ కుమారుడు హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించే పని చేశాడు. కానీ అతడి మర్మం ఎంతోసేపు దాగలేదు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహానికి స్నానం చేసే సమయంలో లోగుట్టు బయటపడి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అనంతగిరిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం : అనంతగిరి గ్రామానికి చెందిన గౌరు అమృతం(54) పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ 20 ఏళ్ల క్రితమే భార్య లక్ష్మీ తన నుంచి విడిపోయి మాక్లూర్ మండలం గొట్టుముక్కులలో ఇద్దరు కుమారులు మహిపాల్, మనోజ్‌లతో కలిసి ఉంటోంది. వీరిద్దరూ బతుకుతెరువు కోసం దుబాయి వెళ్లిపోయారు. విడిపోయిన ఈ దంపతులు ఎవరి పనులు వారు చేసుకుంటూ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు.

కానీ పెద్ద కుమారుడు మహిపాల్‌కు తండ్రిపై విపరీతమైన కోపం ఉండేది. ఆ కోపమే పగగా మారి హత్య చేసేందుకు దారి తీసింది. తన తండ్రి అమృతం తల్లితో వేరుగా ఉంటున్నాడని, నిత్యం మద్యం తాగుతుండటంతో తనకు ఎవరూ అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రావడం లేదని భావించాడు. తండ్రి వల్లే తనకు పెళ్లి కావడం లేదని, అతణ్ని చంపేస్తే తన వివాహానికి అడ్డు తొలగడంతో పాటు ఆస్తి కూడా వస్తుందనే ఆశతో హత్యకు ప్లాన్ చేశాడు.
ఆస్తి కోసం హత్య - కన్న తండ్రినే కడతేర్చిన బిడ్డలు
ప్లాన్ ప్రకారం తన తండ్రి చనిపోయాడని చెప్పి మహిపాల్ పది రోజుల క్రితమే దుబాయి నుంచి అనంతగిరి గ్రామానికి వచ్చాడు. తండ్రి వద్దే ఉంటూ అతడిని అంతమొందించాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఇంట్లోనే మద్యం సేవించారు. మద్యం తాగిన మత్తులో ఉన్న తండ్రిని మహిపాల్ మెడకు టవల్‌తో గట్టిగా బిగించి హత్య చేశాడు.
సోమవారం ఉదయం ఏమీ తెలియనట్లుగా వైద్యుడిని పిలిపించి తన తండ్రికి ఏమైందో చూడమని చెప్పాడు. అయితే అప్పటికే మృతి చెందిన వృద్ధుడిని చూసి చనిపోయాడని వైద్యుడు ధ్రువీకరించారు. గత కొన్ని రోజులుగా తన తండ్రి ఆరోగ్యం బాగా ఉండటం లేదని, అందుకే చనిపోయి ఉంటాడని మహిపాల్ డాక్టర్‌తో అన్నాడు. ఇదే విషయం చెప్పి గ్రామస్థులనూ నమ్మించాడు. బంధువులకు ఫోన్ చేసి తన తండ్రి చనిపోయాడని చెప్పగా వారంతా అంత్యక్రియలకు హాజరయ్యారు.
అంతా బాగానే ఉంటే ఈ మర్డర్ కేసు నుంచి చాలా ఈజీగా తప్పించుకునే వాడు మహిపాల్. కానీ అంత్యక్రియల సమయంలో అమృతం మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడకు గాయాలను ఆయన సోదరి, బంధువులు గుర్తించారు. వెంటనే మహిపాల్‌పై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించంగా వారు ఘటనాస్థలికి చేరుకుని మహిపాల్‌ను ప్రశ్నించారు.
చివరకు పోలీసుల విచారణలో మహిపాల్ తన తండ్రిని తానే హతమార్చినట్లు అంగీకరించాడు. తండ్రి నిత్యం మద్యం తాగుతుండటంతో తనకు పెళ్లి కావడం లేదని, తల్లితో వేరుగా ఉండటం కూడా తనకు నచ్చడం లేదని పోలీసులకు చెప్పాడు. తండ్రి ఆస్తులు, గేదెను విక్రయించి తల్లి పేరిట ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో హత్య చేశానని అంగీకరించాడు. బంధువుల ఫిర్యాదు మేరకు మహిపాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికి ఒప్పుకోలేదని పగ.. వివాహం రోజే వధువు తండ్రి హత్య.. పారతో కొట్టి..