Seizure Of Office Property Of Fisheries Department : నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ఉన్న మత్స్యశాఖ చరాస్తులను జిల్లా న్యాయస్థాన సిబ్బంది జప్తు చేశారు. మత్స్యశాఖకు కోర్టు ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేయడంతో కార్యాలయ చరాస్తులను జప్తుచేయాలని ఆదేశించింది. తదనుగుణంగా న్యాయస్థాన సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని మత్స్యశాఖ కార్యాలయానికి బుధవారం మధ్యాహ్నం జిల్లా న్యాయస్థాన సిబ్బంది చేరుకున్నారు. పలువురు సమక్షంలో అక్కడున్న వస్తుసామగ్రిని జప్తుచేసి తరలించారు.
ఇదీ జరిగింది : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రాంతానికి చెందిన నేరెళ్ల లక్ష్మణ్ 2015 నుంచి మత్స్యశాఖలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆసిఫాబాద్, లక్షెట్టిపేట మత్స్యశాఖ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయనను 2017లో ఉద్యోగం నుంచి తొలగించారు. ఎందుకు తొలగిస్తున్నారనే విషయంలో తగిన స్పష్టత లేదు. అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదేంలేక పారిశ్రామిక ట్రిబ్యునల్- కార్మిక న్యాయస్థానం-అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు (గోదావరి ఖని)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడికి డేటా ఎంట్రీ ఆపరేటర్/ ఫిషర్మెన్, ఫీల్డెమెన్/ ఆఫీస్ సబార్డినేట్ లేదా వీటికి సమానమైన ఓ ఉద్యోగం కేటాయించాలని సూచించింది.
మత్స్యశాఖ ఆస్తుల జప్తు : పిటిషన్‌దారుడిని ఉద్యోగం తొలగించిన 21 నెలల కాలం మొత్తం వేతనం రూ.5,94,300 అతడికి చెల్లించాలని పేర్కొంది. అయితే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలవ్వలేదు. ఈ నేపథ్యంలో నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయాల ఆస్తులు, హైదరాబాద్‌లోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయ వాహనాలను జప్తుచేయాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది.
ఈ నెల 31 లోపు చర్యలు తీసుకోవాలంటూ నిర్మల్ జిల్లా న్యాయస్థానానికి సిఫార్సు చేయడంతో, వారి సూచనలకు అనుగుణంగా ఇక్కడి న్యాయస్థాన సిబ్బంది బుధవారం జిల్లా మత్స్యశాఖ కార్యాలయ చరాస్థులను (కుర్చీలు, కంప్యూటర్లు, బల్లలు, తదితర వస్తువులు) స్వాధీనం చేసుకొని న్యాయస్థానానికి తరలించారు. ఇదేరీతిలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయ చరాస్తులు, హైదరాబాద్ కమిషనర్ కార్యాలయ వాహనం సైతం అటాచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం ఆస్తులను జప్తు చేసిన కోర్టు సిబ్బంది