RS.60 Lakhs Jobs Fraud in Jayashankar Bhupalpally : జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి నకిలీ చెక్కులు, ఒక కారును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు రూ.60 లక్షలకు పైగా మోసం చేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఎస్పీ కిరణ్ ఖరే వివరాలు వెల్లడించారు.
కొంత డబ్బే ఉద్యోగం మీకే అంటూ : జయశంకర్ భూపాలపల్లికి చెందిన గుర్రం శ్రీనివాస్ రావు, సన్నాయిల సుభాశ్, మోకిడి అశోక్, శ్రీకాంత్ కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పించే ఏజెన్సిని నిర్వహించేవారు. దీని ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతర ఆఫీసుల్లో చిన్నపాటి ఉద్యోగాలు ఇప్పించేవారు. అయితే అవసరం ఉన్నదాని కంటే ఎక్కువ మందిని ఉద్యోగంలో చేర్పించేవారు. అలా నిరుద్యోగులు, ఆశావహులకు కొంత డబ్బులు ఇస్తే చాలు పక్కాగా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, తర్వాత అది పర్మినెంట్ అవుతుందంటూ ఆశ చూపించేవారు. ఆ మాటలు నమ్మి పలువురు యువతీ యువకులు వారికి రూ.లక్షల్లో మూట చెప్పారు.
ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలు వసూలు చేసేవారు. ఇప్పటివరకు దాదారు 50 మంది వద్ద సుమారు రూ.60 లక్షలు వసూలు చేశారు. ఇలా డబ్బులు తీసుకున్న వారికి డ్యూటీలు వేసేవాడు. నెలంతా ఏదో ఓ పని చేయించి, జీతం విషయం వచ్చేసరికి తప్పించుకుని తిరిగేవారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు శ్రీనివాస్ అనే వ్యక్తిని నిలదీయగా, అసలు నిజం బయటపడింది.
అదనంగా ఉద్యోగాలు ఇప్పిస్తూ : ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన దానికంటే అదనంగా (ఉదాహరణకు 50 మంది అవసరమైతే దానికి అదనంగా వీరి అవసరాల కోసం 100 మందికి ఉద్యోగం అవకాశం కల్పించేవారు) సిబ్బిందిని నియమించేవారు. వచ్చే జీతంలో తలా కొంత సర్దేవారు. ఒక్కరు చేయాల్సిన పనిలో ఇద్దరిని నియమించి, చెరో 4 గంటల చొప్పున పని చేయించేవారు. చివరకు ఒక్కరికి వచ్చే జీతంలోనే ఇద్దరికీ సర్దుబాటు చేసేవారు. అది కూడా టైమ్‌కు ఇవ్వకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చి కూపీ లాగడంతో డొంక కదిలింది.
మోసపోయామని తెలుసుకున్న పలువురు శ్రీనివాస్‌ను నిలదీయగా, కొంతమందికి కొంత నగదు ఇచ్చి, మరికొందరికి చెక్కులు రాసి ఇచ్చాడు. తీరా ఆ చెక్కులు తీసుకుని బ్యాంకుకు వెళ్తే అవి కాస్తా బౌన్స్ కావడంతో శ్రీనివాస్‌పైకి తిరగబడ్డారు. విషయం కాస్తా పెద్దది కావడంతో బాధితులందరికీ తెలిసిపోయింది. దాంతో అందరూ కలిసి శ్రీనివాస్‌ను చితకబాదారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నకిలీ చెక్కులు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.
ఎవరైనా ఇలా నిరుద్యోగులు, ఆశావాహులను ఆసరాగా చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. అలాగే నిరుద్యోగులు కష్టపడి ఉద్యోగాలు సాధించుకోవాలని సూచించారు. ఉద్యోగాల పేరిట డబ్బులు అడిగితే నమ్మొద్దని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం - న్యాయం చేయాలని బాధితులు ఆవేదన - Job Fraud Case in Hyderabad