CM Revanth Participate in Distribution of Appointment Letters to Staff Nurses : సంవత్సరంలోపు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నిజం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు (Staff Nurses) ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
తాగునీటి కోసం ప్రతీ నియోజకవర్గానికి కోటి రూపాయల ప్రత్యేక నిధులు: సీఎం రేవంత్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
CM Revanth Fires on BRS : కోర్టు అడ్డంకులను తొలగించి 7వేల 94 మందికి సర్కారీ నౌకర్లు కల్పించామని సీఎం రేవంత్ వివరించారు. విద్యార్థుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో పదేళ్లుగా గత ప్రభుత్వం యువత ఆకాంక్షలు నెరవేర్చలేదని సీఎం మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సీఎం పరివారం గురించి మాత్రమే ఆలోచిస్తోందని ఆక్షేపించారు. ఆరోగ్య తెలంగాణను నిర్మించడంలో నర్సులదే కీలకపాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్ కొనియాడారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి
"విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడింది. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదు. గత ప్రభుత్వం వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచించింది. నిరుద్యోగుల ఆకాంక్షలను నిజం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. సంవత్సరంలోపు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాము". - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
నిరుద్యోగ యువత కోరుకున్నట్లే ఉద్యోగాలు కల్పించే బాధ్యతను రాష్ట్రప్రభుత్వం తీసుకుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పదేళ్లలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందన్న భట్టి, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కొత్త నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖలో మరో 5 వేల ఉద్యోగాల్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఉద్యోగాల భర్తీలో రోస్టర్ విధానాన్ని పక్కాగా అమలుచేయడం వల్ల బడుగు, బలహీన వర్గాలకు ఉద్యోగాల్లో సింహభాగం దక్కాయని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పారదర్శకంగా భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు రాష్ట్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వ చొరవను కొనియాడారు.