Telangana Weather Update : రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మూడు రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో, జలాశయాలు ఉప్పొంగుతున్నాయి. వానలకు పలు జిల్లాల్లోని రోడ్లు చిత్తడిగా మారాయి.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగులకు చేరింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత వారం రోజుల నుంచి భద్రాచలం దిగువ ఉన్న వీలీన మండలాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు, ఇంకా కొన్ని ఇళ్లకు వరద నీరు చేరుతుండటంతో వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది : ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. టేపులగూడెం వద్ద 163 వ జాతీయ రహదారి నీట మునగడంతో పది రోజులుగా ఛత్తీస్‌గడ్ నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి. అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీ గేట్స్ ఏర్పాటు చేసిన పోలీసులు అటుగా ఎవరు వాగు దాటకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో స్తంభాలు, చెట్లు ఎక్కడికక్కడ కుప్పకూలాయి. కొత్తగూడ మండలం గుంజేడు నుండి చిట్యాల గడ్డకు వెళ్లే రహదారిలోని బిజ్జోని కుంట దగ్గర రాత్రి విద్యుత్ తీగలపై చెట్టు కూలడంతో పలు గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది జోరు వానలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా చెట్లను తొలగించి మరమ్మత్తులు చేసి విద్యుత్తును పునరుద్ధరించారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని కుమురం భీం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. కమాన్పూర్ మండంలోని గుండారం జలాశయం, మంథని మండలం గుండా ప్రవహించే బొక్కల వాగు భారీగా నిండి మత్తడి పోస్తున్నాయి.
భద్రాచలం వద్ద డేంజర్ - 51.3 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం - BHADRACHALAM GODAVARI WATER LEVEL