Public Rush For AP Polls in Hyderabad : లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి పట్టణంలో ఉన్న ప్రజలు సొంతూళ్లకు వెళ్తుండటంతో ప్రయాణికుల సంఖ్యా పెరిగిపోతుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ప్రయాణికులు పెరగడంతో 2 తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నాయి. ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయ్యాయి. దాదాపు 400 బస్సులకు ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అదనంగా మరో 150 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలకు వెయ్యికి పైగా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ సర్వీసులను హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్‌తో పాటు ఆరాంఘర్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి నడిపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
TSRTC Run Special Buses For AP Voters : టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రోజుకు 400 పైచిలుకు బస్సులు నడిపిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ బస్సులన్నింట్లోనూ రిజర్వేషన్లు దాదాపు పూర్తైనట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో వచ్చేందుకు 13, 14 తేదీల్లో ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు.
అధిక ఛార్జీలు వసూలు : ఆర్టీసీ బస్సుల్లో సీట్లులేక ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తే, ఇదే అదనుగా చేసుకొని ఇష్టారీతిన టికెట్ ధరలను పెంచేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. విజయవాడ, విశాఖపట్టణం వైపునకు వెళ్లే బస్సుల్లో టికెట్ ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెంచినట్లు ప్రయాణికులు తెలుపుతున్నారు.
"ఎన్నికల కోసం అందరూ ఊరు వెళ్తుండటంతో బస్సుల్లో టిక్కెట్లు అంతగా దొరకటం లేదు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు అయితే మొత్తం ముందుగానే రిజర్వ్ అయ్యున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అంతగా రావటం లేదు. వచ్చినా కూడా ధరలు చాలా అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాలు దీనిపై స్పందించి ఇంకొన్ని ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది." -ప్రయాణికులు
ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 50 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడిపిస్తున్నారు. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. వీటితో పాటు మరో 22 రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఈ ఎన్నికల నేపథ్యంలో కొంత మంది విమానాలను ఆశ్రయిస్తుండటంతో విమానాలకు కూడా డిమాండ్ పెరిగింది. దీనికి అనుగుణంగా విమాన చార్జీలు గణనీయంగా పెరిగాయి. విమాన టికెట్ ధరలు 20 నుంచి 30 శాతం మేర టికెట్ ధరలు పెరిగాయి. రద్దీకి తగ్గట్లు అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని, అధిక ధరలకు టికెట్‌లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.