Precautions To House Owners : అద్దె ఎంతైనా పర్వాలేదు, అడ్వాన్స్ ఎంతైనా ఇస్తాం, మా సొంతిల్లులా భద్రంగా చూసుకుంటాం. కిరాయికి చేరే ముందు తీయటి మాటలు చెవికి తాకగానే చాలా మంది ఇప్పుడే చేరిపోమంటూ బంపర్ ఆఫర్ ఇస్తుంటారు. గేటుకు వేలాడే టు లెట్ బోర్డును ఎప్పుడెప్పుడు తీసేయాలా! అనే తొందరలో వచ్చిన వారి గురించి సమగ్ర వివరాలు తెలుసుకోకుండానే ఇంటి తాళాలు అప్పగిస్తున్నారు. అకస్మాత్తుగా పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు తాము చేసిన పొరపాటు గుర్తించి లబోదిబోమంటున్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక తలపట్టుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా ఒక అడుగు ముందుకేసి, యజమానులను బెదిరిస్తూ నెలల తరబడి సొమ్ములు చెల్లించకుండా తిరుగుతున్నారు.
మచ్చుకు కొన్ని ఘటనలు :
- దిల్లీ, పుణె పోలీసుల కళ్లుగప్పిన కరడుగట్టిన ఉగ్రవాది రిజ్వాన్ సైదాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌లో 6 నెలలు పాటు అద్దెకు ఉన్నాడు. ప్లాట్ రెంట్‌కు ఇచ్చే సమయంలో నిర్వాహకులు అతడి నుంచి ఆధారాలు (ఐడీ) తీసుకోలేదు. కిరాయి కేవలం రూ.5 వేలే కదా అని ఒప్పంద పత్రం కూడా రాయించుకోలేదు.
- టోలీ చౌకిలో ఓ ఇంట్లో అద్దెకు దిగిన ఇద్దరు మహిళలు రెండు నెలల కిరాయి అడ్వాన్స్ చెల్లించి ఏడాది పాటు ఇంటి యజమానికి నరకం చూపించారు. ఇల్లు ఖాళీ చేయమన్న యజమానికి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించారు.
- మాదాపూర్‌లో ఓ రిటైర్డ్ ఉద్యోగి తన ప్లాట్‌ను అద్దెకిచ్చారు. కుటుంబంతో ఉన్నట్టు చెబుతూనే అతడు ఆ ఇంటిని వ్యభిచార కొంపగా మార్చాడు. పోలీసుల తనిఖీల్లో బండారం బయటపడటంతో ఇంటి యజమానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అప్రమత్తంగా లేకుండా అంతే సంగతులు : నగరంలో కొందరు యజమానులు జాగ్రత్తలు పాటిస్తే మరికొందరు వచ్చే అద్దె సొమ్ములు లెక్కలేసుకుంటున్నారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న కేటుగాళ్లు దర్జాగా ఇళ్లలోకి చేరి అసాంఘిక కార్యక్రమాలు సాగిస్తున్నట్టు పోలీసుల దాడుల్లో వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్‌లో విశ్రాంత ఉద్యోగి ఇంట్లోకి బార్యభర్తలమంటూ ఓ జంట కిరాయికి చేరారు. భార్యభర్తలిద్దరం పోలీసు శాఖలో పనిచేస్తున్నట్టు నమ్మించారు. కొద్దిరోజుల తరువాత రాత్రివేళల్లో అపరిచిత వ్యక్తుల రాకపోకలు పెరగటంతో యజమాని నిలదీశాడు. పోలీసుల తనిఖీ సమయంలో అసలు విషయం వెలుగులోకివచ్చింది. వారి వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో ఫోన్లలో వేలాది మంది యువతుల ఫొటోలు బయటపడ్డాయి. గచ్చిబౌలిలోని ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఐటీ ఉద్యోగినంటూ చేరాడు. ఉప్పల్‌లో సొంతిల్లున్నా కార్యాలయానికి దగ్గర అనే ఉద్దేశంతో ప్లాట్ తీసుకున్నట్టు యజమానిని నమ్మించాడు. వారాంతపు సమయంలో మిత్రులను రప్పించి డ్రగ్స్ తీసుకుంటూ రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తించి ఇంటిని ఖాళీ చేయించినట్లు సమాచారం.
ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయం! - ఎందుకో తెలుసా? - Real Estate Market in Hyderabad