post Office Scam In Adilabad : ఎండా వానలు లెక్కచేయక కష్టాలకు ఎదురీదుతూ కోటీ ఆశలతో అన్నదాతలు పత్తి పండించారు. బహిరంగ మార్కెట్లో ధర లేకపోవటంతో ఈసారి ఆదిలాబాద్ రైతులు ప్రభుత్వ సంస్థ అయిన సీసీఐకి విక్రయించారు. ఆధార్ అనుసంధానంతో కొనుగోళ్లు జరపడంతో డబ్బులను బ్యాంకు ఖాతాల్లో ఆన్లైన్‌లో జమ చేశారు. ఇందులో పలువురు రైతుల నగదు పోస్టాఫీసు ఖాతాల్లో పడింది. సదరు ఖాతాల్లో ఒక్కరోజు 10వేలకు మించి తీసుకునే అవకాశం లేకపోవడంతో ఇతర బ్యాంకుల్లోని పొదుపు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు అధికారి ఓటీపీ, బయోమెట్రిక్‌ల ద్వారా సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. రెండు నెలలుగా డబ్బులు రాకపోవడంతో కొందరు రైతులు గట్టిగా నిలదీయడంతో మోసం వెలుగులోకి రాగా నిందితుడు పరారయ్యాడు.
అడుగంటిన బోర్లు - ఎండుతున్న పైర్లు - ఎండ తాకిడికే నెర్రెలు వారుతున్న భూతల్లి
"మేము సీసీఐకి పత్తి అమ్మాము. వాటికి సంబంధించిన డబ్బులు ఐబీపీ అకౌంట్లో పోస్టాఫీస్ దస్నాపుర్లో జమ అయ్యాయి. ఆ డబ్బులు మా అకౌంట్లో ఇంత వరకు జమకాలేదు. మేము ఐబీపీ మేనేజర్ గారిని సంప్రదించాము. ఆయన అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్ తీసుకున్నారు. మా మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుందని చెప్పి మా డబ్బులను ఆయన వ్యక్తిగత అకౌంట్లోకి మళ్లించారు. మేము ఆయనకు సంప్రదించగా రేపు, మాపు అని మాటలు చెప్పుతూ కాలం గడిపేస్తున్నారు. ఆయన ఆఫీసుకు కూడా మూడు రోజుల నుంచి రావడం లేదు. మా డబ్బులను మాకు తిరిగి ఇప్పించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం" - స్వామి, బాధిత రైతు
post Office Officer Fraud : రైతుల ఫిర్యాదుల ఆధారంగా 30లక్షల రూపాయల మేర ఐపీపీబీ అధికారి జాదవ్ విజయ్ తన ఖాతాలో జమ చేసుకున్నట్లుగా తెలుస్తోందని తపాలశాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పుష్పేందర్ కుమార్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే సైబర్ నేరస్థులు OTPలు, తదితరాల పేరుతో జేబులు గుళ్ల చేస్తున్నారు. ఆదిలాబాద్ తపాలా అధికారి మాత్రం కళ్లెదుటే రైతుల ఖాతాలు ఖాళీ చేయడంతో ఎవరినీ నమ్మాలో తెలియట్లేదని ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
రైతులకు వినూత్న సాంకేతిక సేవలు అందిస్తున్న యువతి - 4 రాష్ట్రాల్లో అన్నదాతలకు చేయూతగా న్యాస్టా సంస్థ
ఆలోచనకు పదునుపెట్టి - వర్షపు నీటిని ఒడిసిపట్టి - బీడుభూములను సాగుభూములుగా మల్చుకున్న రైతులు