Bhujanga Rao Statement on Phone Tapping Case : తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాగ్మూలంలోని కీలక అంశాలను పోలీసులు బయటపెట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే వారితో పాటు పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లనూ ట్యాపింగ్ చేశామని అదనపు ఎస్పీ భుజంగరావు కస్టడీ విచారణలో భాగంగా దర్యాప్తు బృందానికి వెల్లడించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను సైతం రహస్యంగా రికార్డు చేశామని పోలీసులకు తెలిపారు. ప్రతిపక్ష నేతలతో పాటు వారి కుటుంబ సభ్యులు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామని అధికారులకు భుజంగరావు వెల్లడించారు. వారి వాహనాలను సైతం ట్రాక్ చేశామని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల సమయంలో బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లను ట్యాపింగ్ చేశామని విచారణలో భుజంగరావు వెల్లడించారు.
Telangana Phone Tapping Case Updates : రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్‌తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నామని ఆయన తెలిపారు. ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ సహకారంతో ఇవన్నీ చేశామని వివరించారు. గత సంవత్సరం అక్టోబర్‌లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది. ఎలాగైనా సరే మూడోసారి గులాబీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బులను తరలించామని తెలిపారు.
Settlements Under BRS Instructions : వివిధ కంపెనీలు, ప్రముఖులు, వ్యాపారవేత్తల వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో పరిష్కరించామని, రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావు నుంచి రూ.13 కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనేలా చేశామని వాంగ్మూలంలో తెలిపారు. మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించామన్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, కామారెడ్డి కమలం పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ విషయంలో కేటీఆర్‌పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను రికార్డు చేశామని తెలిపారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వివరాలను, పేర్లను మొబైల్ నంబర్స్ మొత్తం ప్రొఫైల్‌ను ప్రణీత్ రావుకు అందజేశామని విచారణ బృందానికి తెలిపారు. ఇంటెలిజెన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో ఫోన్లను ట్యాపింగ్ చేశామని తెలిపారు. మాదాపూర్ ఎస్వోటీ పోలీసుల సపోర్ట్‌తో మొత్తం ఆపరేషన్ నిర్వహించామని వెల్లడించారు.