Bus Facility not Available in Valluru : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం వల్లూరు, ఉదండపూర్ గ్రామాలు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ జలాశయం కింద ముంపునకు గురయ్యాయి. ముంపు గ్రామాలు కావడంతో ఆ మార్గంలో ప్రయాణించే బస్సు రద్దైంది. ఆటోలో వెళ్లాలంటే నెలకు రూ.2,000 నుంచి రూ.3,000 ఖర్చవుతోంది. ఈ భారాన్ని మోయలేక కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువులు మాన్పించేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను ఉన్నత చదువులకు పంపేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపడం లేదని తెలిపారు.
రోడ్డంతా గుంతలమయం : ఆటోల్లో ప్రయాణమైనా సురక్షితంగా ఉందా అంటే అదీ లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా టిప్పర్లు, లారీల్లాంటి భారీ వాహనాలు తిరగడంతో ఆ రెండు గ్రామాలకు వెళ్లే రోడ్డు దారుణంగా ధ్వంసమైంది. రోడ్డంతా గుంతలమయం. వానలు పడ్డాయంటే ఆ మార్గంలో ప్రయాణం నరకంతో సమానం. అందుకే ఆటోలు ఆ మార్గంలో ఎక్కువగా ప్రయాణించవు. తిరిగి గ్రామాలకు వచ్చేటప్పుడు సైతం ఆటోలు దొరకడం కష్టమే. దీంతో సకాలంలో కళాశాలలకు వెళ్లడం, వేళకు ఇంటికి తిరిగి రావడం కష్టంగా మారుతోంది.
'బస్సు వేసేదెప్పుడో.. కష్టాలు తీరేదెప్పుడో?'.. JCBలో స్కూల్కు విద్యార్థులు!
Student Not Studied Due to no Bus : గతంలో బాదేపల్లి నుంచి బండమీదిపల్లి, వల్లూరు, ఉదండపూర్ మీదుగా తీగలపల్లి, కాకర్లపాడు, ఫత్తేపూర్ మైసమ్మ మీదుగా మహబూబ్నగర్ వరకూ బస్సు నడిచేది. రోడ్డు బాగోలేదన్న కారణంతో ఆ మార్గంలో బస్సును ఆర్టీసీ రద్దు చేసింది. ఇటీవల తమ గ్రామాలకు బస్సు నడపాలని గ్రామస్థులు ఆర్టీసీకి విజ్ఞప్తి చేసినా, ఇప్పటికీ బస్సు రాలేదు. ప్రస్తుతం ఆ మార్గంలో కొత్త రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రోడ్డు నిర్మాణం పూర్తైతే బస్సులను పునరుద్ధరిస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతూ వస్తున్నారు. కొద్ది రోజుల్లో కళాశాలలు తెరచుకోనున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వల్లూరు, ఉదండపూర్ గ్రామాలకు బస్సును పునరుద్ధరించాలని కోరుతున్నారు.
"మా నాన్న సంపాదించిన డబ్బులు ఆటో ఛార్జీలకే సరిపోతున్నాయి. అత్యవసర సమయాల్లో ఆటోలు దొరకడం కష్టమవుతోంది. చదివించలేక మాన్పించేస్తున్నారు. బస్సులు లేక మేము మా చదువు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే మాకు బస్సు వేయాలని కోరుతున్నాం." - విద్యార్థి
భారంగా మారిన రవాణా ఖర్చులు : కేవలం విద్యార్థులు మాత్రమే కాదు ఉపాధి కోసం నిత్యం వందల మంది వల్లూరు, ఉదండపూర్ నుంచి జడ్చర్ల, మహబూబ్నగర్ సహా పోలెపల్లి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. ఉన్న పొలాలన్నీ ముంపులో పోయాయి. ఊళ్లో ఉపాధి లేదు. అందుకే పొట్టకూటి కోసం అంతా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. వారికి రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయి. బస్సు సౌకర్యం కల్పిస్తే ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలకు సైతం ఊరట లభించనుంది.
Sajjanar Tweet: బస్సు సౌకర్యం కల్పించాలని యువకుడు ట్వీట్.. సజ్జనార్ ఏమన్నారంటే