NDSA Committee on Annaram and Sundilla Barrages : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇన్వెస్టిగేషన్స్ అన్నీ పూర్తయి, ఫలితాలను విశ్లేషించి చర్యలు తీసుకొనే వరకు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీటిని నింపవద్దని నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖకు స్పష్టం చేసినట్లు సమాచారం. అయినా బ్యారేజీలను నింపుతామంటే మీ ఇష్టం అని, తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గత సంవత్సరం జులై 22న ఎన్‌డీఎస్‌ఏ, నీటిపారుదల శాఖ మధ్య జరిగిన సమావేశానికి ఇప్పటికి బ్యారేజీలకు సంబంధించిన తదుపరి పరీక్షల్లో ఎలాంటి పురోగతి లేదని, చేసిన పరీక్షల ఫలితాలను విశ్లేషించడం తప్ప మరెలాంటి ప్రక్రియ జరగలేదని, అలాంటప్పుడు నీటిని ఎలా నింపుతామని అంటారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఊహాజనితంగా మాట్లాడటం సరైంది కాదని ఓ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ఎన్‌డీఎస్‌ఏ సూచన మేరకు ఇప్పటివరకు జరిగిన పరీక్షలు, వాటి ఫలితాలతోపాటు అన్నారం, సుందిళ్లలో నీటిని నింపాలన్న నీటిపారుదల శాఖ ప్రతిపాదనపై శుక్రవారం దిల్లీలో సమావేశం జరిగింది. ఈ మేరకు ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ ఛైర్మన్, కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, కమిటీలోని ఇతర సభ్యులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు అనిల్‌కుమార్, నాగేంద్రరావు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఇన్వెస్టిగేషన్స్ పూర్తయ్యాక వాటిని విశ్లేషించి ఫలితాలను డిసెంబరులోగా ఇస్తామని నిపుణుల కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నీటిపారుదల శాఖ అధికారులకు చెప్పినట్లు సమాచారం.
నివేదిక రాగానే అవసరమైన ప్రణాళికతో సిద్ధంగా ఉండండి : ''బ్యారేజీల వైఫల్యాలకు గల కారణాలను, దీని వల్ల ఎలా ముందుకెళ్లాలో కూడా చెబుతాం. ఇతర ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నందున డిజైన్లు, డ్రాయింగ్‌లతో నీటిపారుదల శాఖ సిద్ధంగా ఉండాలి. మా నివేదిక రాగానే బ్యారేజీల పునరుద్ధరణ పనులు మొదలు పెడితే వచ్చే సీజన్‌లో నీటిని నింపడానికి అవకాశం ఉంటుంది. మాతో జులైలో సమావేశం అయిన తర్వాత బ్యారేజీలకు వరద ప్రవాహం వచ్చింది. దీంతో పరీక్షలు పూర్తి చేయలేదు. పరీక్షలే పూర్తి కానప్పుడు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను నింపితే ఏం కాదని చెప్పే పరిస్థితిలో మేము లేం'' అని ఎన్‌డీఎస్‌ఏ కమిటీ స్పష్టం చేసినట్లు సమాచారం. తాము డిసెంబరులో నివేదిక ఇవ్వగానే దాని ప్రకారం పనులు చేయడానికి అవసరమైన ప్రణాళిక తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలని నిపుణుల కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
అన్నారం బ్యారేజీలో ఇసుక మేటలు - మళ్లీ మొదటికి వచ్చిన సమస్య - Sand dunes in Annaram Barrage