Cash Seized in Telangana 2024 : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈసీ ఆదేశాలతో క్షేత్రస్థాయికి కదిలిన అధికారులు విస్తృత సోదాలు చేపడుతున్నారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి సోదాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.155 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రూ.61.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని వికాస్‌రాజ్ తెలిపారు. పోలీసులు, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలు వేర్వేరుగా రూ.28.92 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. వివిధ విభాగాలు రూ.23.87 కోట్ల విలువైన 27 క్వింటాళ్ల డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పారు. అలాగే వివిధ ప్రాంతాల్లో రూ.19.16 లక్షల కోట్ల విలువైన బంగారం, వెండి, ఇతర ఆభరణాలతో పాటు, రూ.22.77 కోట్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, కుక్కర్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వికాస్‌రాజ్ వెల్లడించారు.
Police Checking in Telangana During Election Code 2024 : మరోవైపు హైదరాబాద్ అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎంజే మార్కెట్ కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ వ్యాపారి వద్ద రూ.65 లక్షల డబ్బు పట్టుబడింది. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలను చూపకపోవడంతో సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. అయితే సొమ్ము తీసుకెళ్తున్న వ్యాపారి సమాచారాన్ని అబిడ్స్ పోలీసులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.
లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా ఏర్పాట్లు : మరోవైపు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వికాస్‌రాజ్ పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించేందుకు సీఈసీ మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. సుమారు 70,000ల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 160 కంపెనీల సాయుధ బలగాలను రాష్ట్రానికి కేటాయించిందని, ఇప్పటికే 60 కంపెనీల బలగాలు వచ్చాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,355 వివిధ నిఘా బృందాలు పనిచేస్తున్నాయని వికాస్‌రాజ్ అన్నారు.
Lok Sabha Election Code in Telangana 2024 : తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వికాస్‌రాజ్ తెలిపారు. వాటికి అదనంగా 452 సహాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సీఈసీ అనుమతి ఇచ్చిందని చెప్పారు. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో 2.90 లక్షల మంది ఉద్యోగులు భాగస్వాములు కానున్నారని వివరించారు. ఒకవేళ ఎన్నికల విధులకు హాజరుకాకపోతే కఠిన చర్యలుంటాయని వికాస్‌రాజ్ హెచ్చరించారు.