Youth Addicts on Reels Craze : గతంలో చైనీయుల యాప్ టిక్‌టాక్‌తో షార్ట్ వీడియోల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో కొందరు ఫేమస్ అవ్వడం కోసం విశ్వప్రయాత్నాలు చేసేవారు. అదే టిక్‌టాక్ మరికొందరి కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టింది. కొన్నిరోజుల అనంతరం ప్రైవసీ దృష్ట్యా భారత్ ఈ యాప్‌ను నిలిపివేసింది. అప్పటి నుంచి మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకునే వెసులుబాటు వచ్చింది.
అలా తమలోని ప్రతిభను రోజురోజుకి బయట ప్రపంచానికి చూపించేవారు. అనంతరం అది కాస్తా పిచ్చిగా మారి, వికృత చేష్టలకు పరాకాష్టగా మారుతోంది. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనం. రీల్స్ చేస్తున్నామనే భ్రమలో పడిన వారు, ప్రమాదం అంచున ఉన్నామనే విషయాన్నే మర్చిపోయి ప్రాణాలు కోల్పోతూ, కన్నవారికి వారికి కన్నీళ్లు మిగుల్చుతున్నారు.
హయత్‌నగర్‌లో విషాధం.. ఇటీవల కాలంలో కేవలం రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని హయత్ నగర్ సమీపంలో బైక్‌తో విన్యాసాలు చేస్తూ పడి శివ అనే యువకుడు ప్రాణాలు కొల్పోగా, అతని స్నేహితుడు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. మరో ఘటనలో ఉప్పల్‌లో రీల్స్ మోజులో ఇంట్లో వారిని పట్టించుకోవడం లేదని భార్యపై ఆగ్రహించిన భర్త హత్య చేశాడు. కుమార్తెను రైల్వే స్టేషన్లో వదిలి పారిపోగా, కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఇన్‌ఫ్లూయెన్సర్ ఆన్వి కందార్ మృతి.. ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఆన్వి కందార్, రీల్స్ చేసేందుకు మహరాష్ట్రలోని కుంభీ వాటర్‌ఫాల్స్ వద్దకు వెళ్ళి 300 అడుగుల లోయలో పడి ప్రాణాలు విడిచింది. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ప్రాంక్ రీల్ చేసేందుకు వీడియో చిత్రీకరిస్తుండగా మెడకు తాడు బిగుసుకుని 11 ఏళ్ల కరణ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇవే కాక రీల్స్ మోజులో ఇంకా అనేకం రోజూ చూస్తూనే ఉన్నాం. అయినా కూడా రీల్స్ పిచ్చిలో వారు తమ విచక్షణను కోల్పోయి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని నిపుణులు అంటోన్నారు.
ఇవి వెలుగులోకి వచ్చినవి మాత్రమే ఇంకా వెలుగులోకి రానివి చాలానే ఉన్నాయి. నిజానికి స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక లైఫ్ స్టైల్ మారిపోయింది. సోషల్ మీడియా నిత్య జీవితంలో భాగమైంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. కొందరు డ్యాన్సులతో, మరికొందరు ఫన్నీ వీడియోస్‌తో, క్రియేటివ్ కంటెంట్‌తో రీల్స్ చేసి సెలబ్రిటీ అయిపోవాలని ఒళ్లు మరచి రీల్స్ చేస్తున్నారు. రీల్స్ మోజులో పడి తమ ప్రాణాల్ని కోల్పోయి అటు కుటుంబానికి, కన్నవారికి తీరిన శోకం మిగుల్చుతున్నారు. రీల్స్ చేసే ముందు కొంత విచక్షణతో ఆలోచించి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా తీసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది.
"సామాజిక మాధ్యమాలు అంటే జీవితం కాదు. తమకు వ్యక్తిగత గుర్తింపు ఉండాలంటే సోషల్ మీడియా అనే భ్రమలోంచి బయటపడాలి. వీలైనంత వరకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి, సమయం కుదిరినప్పుడల్లా కుటుంబ సభ్యులతో గడపాలి". - వైద్య నిపుణులు
రీల్స్ మోజులో భార్య - హత్య చేసిన భర్త - వీడిన ఉప్పల్ మర్డర్ మిస్టరీ - Man Killed wife in Uppal