Lovers Committed Suicide : వారి అభిరుచులు కలిశాయి.. మనసులు ఏకమయ్యాయి.. ప్రేమతో చేరువై.. ఏడు అడుగులతో ఒక్కటై.. కలకాలం కలిసి బతకాలని కలలు కన్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒకరి చేతిపై మరొకరి పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ప్రేమ, పెళ్లి విషయం పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఒప్పుకోలేదు. కల చెదిరిందని తలచారు.. కలసి ఉండలేమని తల్లడిల్లారు. విడిపోలేక.. ఏకంగా ఈ లోకాన్నే వీడి వెళ్లిపోయారు. రైలు కిందపడి సూసైడ్ చేసుకుని కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పెదకాకానిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
రైల్వే పోలీసులు, స్థానికులు, బంధువుల తెలిపిన వివరాలు ప్రకారం.. పెదకాకానికి చెందిన దానబోయిన సాంబశివరావు, సామ్రాజ్యం చిన్న కుమారుడు మహేశ్ (22), ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రుద్రవరానికి చెందిన నండ్రు వెంకయ్య (లేటు), విజయల చిన్న కుమార్తె శైలజ (20) రెండేళ్ల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సెల్ షోరూంలో వర్క్ చేశారు. వారి పరిచయం లవ్ ట్రాక్ ఎక్కింది. కొన్ని నెలల కిందట ప్రేమ విషయం వారు పెద్దలకు చెప్పగా మ్యారేజ్‌కు నిరాకరించారు. అతను డిప్లొమో చేయగా.. ఆమె ఇంటర్మీడియట్ చదువుకుంది.
మిస్సింగ్ కేసుగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు : ఇటీవల శైలజ గుంటూరు వచ్చి ఓ ప్రైవేటు హాస్పిటల్లో రిసెప్షనిస్టుగా, మహేశ్ ప్రైవేటు ఎంప్లాయిగా చేస్తున్నారు. యువతి స్థానికంగా రూం రెంట్‌కు తీసుకొని ఉంటోంది. మహేశ్ కొన్నాళ్ల నుంచి ఇంటిని వీడి బయటకు వచ్చి ఆమెతో కలిసి ఉంటున్నారు. కుమారుడు ఇంటికి రాకపోవడం, మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో ‘మహేశ్ నీకు నచ్చినట్లు, నువ్వు చెప్పినట్లు చేస్తాను’ అని అతని తండ్రి వాయిస్ మెసేజ్ పంపారు. ‘నేను శుక్రవారం సాయంత్రం వస్తాను’ అని మహేశ్ రిప్లై సందేశం ఇచ్చారు.
మరోవైపు ఈ నెల 10న తన సోదరికి శైలజ కాల్ చేసి ఇంటికి వస్తున్నట్లు తెలిపారు. 15 వరకు రాకపోవడంతో ఈ నెల 16న తన కుమార్తె కనిపించటం లేదని నందిగామ పోలీసులకు కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయగా మిస్సింగ్ కేసుగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి గుంటూరు కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం వారికి తెలియడంతో పెద్దలు తమ పెళ్లి చేయరని తలచి మనస్తాపంతో పెదకాకాని శివారులో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. అంతకంటే ముందు అమ్మాయి తన తల్లికి ఫోన్ చేసి పెదకాకాని రావాలని చెప్పి ఫోన్ కట్ చేసింది. రైల్వే పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.