BRS Raithu Poru Bata in Adilabad: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఆదిలాబాద్‌లో అగ్గి మొదలైందని, రైతులు, ప్రజల కోసం పోరాడుతూ తాము జైలుకెళ్లటానికైనా సిద్ధమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారపగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మోసాలను వచ్చే నెల మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసా సహా ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయటం లేదని ఆరోపించారు. మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో ఆదిలాబాద్‌లోని రాంలీల మైదానంలో బీఆర్ఎస్ ఏర్పాటుచేసిన నిరసన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మోసపూరిత హామీలేనా?: తనపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీసులు కేసు నమోదు చేయటాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. రైతుల పక్షాన జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. చంద్రబాబునాయుడు, వైఎస్‌రాజశేఖర్‌రెడ్డిలతో తలపడిన తమకు ఈ చిట్టినాయుడైన రేవంత్‌రెడ్డిని ఎదుర్కోవటం ఓ లెక్కా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్నీ మోసపూరిత వాగ్ధానాలపై ఆదిలాబాద్‌లో ప్రారంభమైన ఉద్యమ సెగను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ వేరు కాదనీ, దొందూ దొందేననీ విమర్శించిన కేటీఆర్.. అదానీ దృష్టిపడిన ఆదిలాబాద్, బెల్లంపల్లిలోని సిమెంటు పరిశ్రమలతో పాటు సింగరేణిని కాపాడుకోవటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పత్తి పంటకు క్వింటాల్‌కు రూ. 8800 ఇవ్వటానికి సిద్ధపడినట్లే తెలంగాణలో కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్‌కు ఘనస్వాగతం: పత్తి పంటకు మద్ధతు ధర విషయంపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను వదిలిపెట్టే ప్రసక్తేలేదని వ్యాఖ్యానించారు. దిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లు వ్యవహరించే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పనిచేసేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితే కాదు భారత రైతు సమితిగా పనిచేస్తుందని కేటీఆర్ భరోసానిచ్చారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్ వచ్చిన కేటీఆర్‌కు ఆదిలాబాద్ ప్రజలనుంచి ఘనస్వాగతం లభించింది. సభ విజయవంతం కావటంతో గులాబీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది.
'కేసీఆర్ చేసిన అప్పుల్లో ఎక్కువ భాగం వాటికే ఖర్చు చేశారు - అవన్నీ తప్పుడు ఆరోపణలు'
' రేవంత్‌రెడ్డి పంపే బుల్డోజర్లకు మేం అడ్డంగా నిలబడతాం - హైదరాబాద్‌లో పేదలకు అండగా ఉంటాం'