kadiyam srihari fires on BRS : ఎన్నికల ముందు రామజపం చేసిన బీజేపీ, రామ మందిరం నిర్మించిన ఫైజాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓడిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. అక్కడి బీజేపీ అభ్యర్థిని రాముడు కూడా రక్షించలేదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయన బీజేపీపై మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయని ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి మోదీ తన పదేళ్ల పరిపాలన ద్వారా దేశ ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోయాడని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని దుయ్యబట్టారు. సంఖ్యాపరంగా మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా సీట్లు తగ్గాయని, బీజేపీకి ఓట్లు కూడా తగ్గాయన్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలందరికి బీజేపీతో ప్రమాదం ఉందని రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేయబోతున్నారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. రిజర్వేషన్లు మార్చే ప్రయత్నం చేయబోతున్నారని మండిపడ్డారు. అనేక రకాల పేద బడుగు, బలహీన వర్గాలపై దాడులు చేస్తున్నారని ప్రజల్లో ఆగ్రహ వేషాలు వచ్చి ప్రజలందరు సమిష్టిగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తమ మద్దతును ఉపసంహరించుకుంటే ప్రభుత్వమే గందరగోళంలో పడిపోయే పరిస్థితి ఉందన్నారు. అందుకే చాలా జాగ్రత్తగా బీజేపీ ప్రభుత్వం పని చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ చాలా దారుణంగా దెబ్బతిందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 12 లేదా 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారని, అవకాశం వస్తే ప్రధానమంత్రి పదవికి పోటీ పడతామని చెప్పారన్నారు. ఎంత అవగాహనరాహిత్యం ఒక్క సీటు గెలువని వాడు, ప్రధానమంత్రి సీటు కొరకు పోటీ పడదామని చెబితే ఆ పార్టీ ఎట్లా బతుకుతదని కడియం అన్నారు. రాబోయే కాలంలో మున్ముందు బీఆర్ఎస్ ఏమవుతుందో చెప్పలేమని, ఎమ్మెల్యేలు కూడా ఉంటారా వేరే పార్టీలోకి పోతారా చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు.