Justice LN Reddy Commission Inquiry Telangana Electricity Purchases : విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కరెంటు కొనుగోళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, విద్యుత్ అధికారి రఘు తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై బీఆర్కే భవన్లో జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరై తమ దగ్గర ఉన్న వివరాలను అందించారు. చీకట్లో ఉన్న తెలంగాణలో వెలుగు నింపాలనే లక్ష్యం మాటున అనేక తప్పిదాలు చేశారని కోదండరాం, రఘు అన్నారు.
విచారణ ముగిసిన అనంతరం విద్యుత్ అధికారి రఘు మాట్లాడుతూ భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో ఇప్పటికే చాలా సమస్యలు వస్తున్నాయని తెలిపారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో నాణ్యత లేని యంత్రాలు ఉపయోగించారని ఆరోపించారు. పవర్ ప్లాంట్‌ను గోదావరి ఒడ్డున నిర్మించడం వల్ల వరదలు వచ్చిన ప్రతీసారి భద్రాద్రి ప్లాంట్ మునిగిపోతుందని చెప్పారు. సాంకేతిక పరమైన అంశాలు దృష్టిలో పెట్టుకోకుండా భద్రాద్రి పవర్ ప్లాంట్ పెట్టారని ఆరోపించారు. బొగ్గు గనులకు 280 కిమీ దూరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టారని ధ్వజమెత్తారు. బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి ప్లాంట్ పెట్టడం వల్ల రవాణా ఛార్జీలు పెరిగాయన్నారు. కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా భద్రాద్రి ప్లాంట్ నిర్మించి ఉంటే వ్యయం తక్కువగా ఉండేదని విద్యుత్ అధికారి రఘు అభిప్రాయపడ్డారు.
'రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ సరిగా విద్యుత్ సరఫరా చేయలేదు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు వల్ల రూ.2 వేల కోట్లు అదనపు భారం పడింది. ఛత్తీస్‌గఢ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ డిస్కంలతో రాష్ట్ర డిస్కంలు పీపీఏ చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న పీపీఏకు ఇంతవరకు ఆమోదం లభించలేదు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కు అప్పగించారు. కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా వెళ్తే ఆలస్యం అవుతుందని నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కు ఇచ్చారని' విద్యుత్ అధికారి రఘు అన్నారు.
గత ప్రభుత్వం తొందరపాటు వల్ల విద్యుత్ సంస్థలకు రూ.81 వేల కోట్లు నష్టం : గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. చట్టం ప్రకారం అందరూ నడుచుకోవాలని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలన్నారు. అభివృద్ధి అంటే ఒకరిద్దరికీ లాభం చేయడం కాదని స్పష్టం చేశారు. కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేస్తామన్న బేఖాతరు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తొందరపాటు వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోకు రూ.81 వేల కోట్లు అప్పులయ్యాయని ఆరోపించారు.
గతేడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. భవిష్యత్‌లో గోదావరి వద్ద నీటిమట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంట్‌ను కాపాడుకోగలమా అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం కొద్ది మందికి లాభం చేసేందుకు యత్నించిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానికానికి ఇబ్బందులు తప్పలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. వారు చేసిన తప్పిదాలపై క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడవద్దని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు.
"చట్టం ప్రకారం అందరూ నడుచుకోవాలి. ప్రజాసంక్షేమ కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలి. అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదు. కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేస్తామన్న బేఖాతరు చేశారు. గత ప్రభుత్వం తొందరపాటు వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోకు రూ.81 వేల కోట్లు అప్పులయ్యాయి. గతేడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చింది. భవిష్యత్‌లో గోదావరి వద్ద నీటిమట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంట్‌ను కాపాడుకోగలమా?. గత ప్రభుత్వం కొద్ది మందికి లాభం చేసేందుకు యత్నించింది. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు. గత ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని తుంగలోతొక్కింది." - ప్రొఫెసర్ కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు