IT Raids On Dil Raju and Mythri Movie Makers : హైదరాబాద్‌లో ఆదాయపన్నుశాఖ సోదాలు కలకలంరేపాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు భారీగా వసూళ్లు రాబట్టినా పన్ను చెల్లించలేదన్న భావనతో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్వాహకుడు దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మంగళవారం ఉదయమే దాదాపు 55 బృందాలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. ఏకకాలంలో తనిఖీలను ప్రారంభించిన ఐటీ అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహించారు. సోదాల్లో కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
సంక్రాంతికి భారీబడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్‌రాజు నివాసంలోసోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. గేమ్‌ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల నిర్మాణానికి భారీగా వెచ్చించినట్లు చెబుతున్నారు. ఆ రెండు చిత్రాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలకు ప్రాధాన్యం సంతరించుకొంది. తొలుత బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని దిల్‌రాజు కార్యాలయంతోపాటు జూబ్లీహిల్స్ ఉజాస్ విల్లాస్‌లోని ఇంట్లో సోదాలు చేపట్టారు. దిల్‌రాజు కుమార్తె హన్సితారెడ్డి, సోదరుడు నర్సింహారెడ్డి, శిరీష్ ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు.
దిల్ రాజు, అతని సోదరుడి నివాసంలోనే 21 మంది అధికారులు : దిల్‌రాజు సహా అతని సోదరుడు నర్సింహారెడ్డి ఇంట్లోనే 21 మంది ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఏడు వాహనాల్లో వచ్చిన అధికారులు దిల్ రాజు సోదరుడు నర్సింహారెడ్డి ఇంట్లో 10 మంది, దిల్ రాజు నివాసంలో 11 మంది అధికారులు ఉదయం నుంచి సోదాలు చేశారు. సోదాలు చేసే సమయంలో కౌంటింగ్ మెషిన్లు, పలు డాక్యుమెంట్లను అధికారులు లోనికి తీసుకెళ్లారు.
దిల్‌రాజు సతీమణిని బ్యాంకుకు తీసుకెళ్లిన ఐటీ అధికారులు : దిల్‌రాజు సతీమణి తేజస్వినిని ఐటీ అధికారులు బ్యాంకులకు తీసుకెళ్లారు. ఆమె పేరిట ఖాతాలున్న బ్యాంకుల్లోని లాకర్లు తెరిపించారు. బ్యాంకు లావాదేవీలు కావాలని అడగటం, లాకర్లు తెరిచి చూపాలని అడగడంతో ఐటీ అధికారులకు సహకరించినట్లు తేజస్వినీ తెలిపారు.
మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాల్లో దాడి : మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్, రవిశంకర్‌తో పాటు సీఈవో చెర్రీ ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. వీరితో పాటు మరో 7 మంది భాగస్వాముల ఇళ్లపై కూడా ఐటీ దాడులు చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పుష్ప-2 సినిమా కొద్దిరోజుల క్రితం విడుదలై భారీగా వసూళ్లను రాబట్టినట్లు ప్రచారం జరిగింది. వసూళ్లకు తగ్గట్లుగా పన్ను చెల్లింపు అంశానికి సంబంధించి ఐటీ బృందాలు ఆరా తీశాయి. అందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలించాయి.