Malnutrition Childrens in TG : సరైన పోషణ లేక చిన్నారులు అనారోగ్యం బారిన పడుతుంటారు. పోషకాహార లోపం వారిని ఎదగకుండా చేస్తోంది. ఈ లోపాన్ని సరిదిద్ది ఆరోగ్యవంతులను చేయడంలో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి పోషకాహార పునరావాస కేంద్రం (న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్) ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ కేంద్రం జాతీయ ఆరోగ్య మిషన్ కింద పనిచేస్తుంది. దీనిలో మొత్తం 20 పడకలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోషకాహార లోపంతో ఉన్న పిల్లలను ఇక్కడ చేర్పించవచ్చు. ఎంజీఎం వైద్యుల సూచన మేరకు ఈ సెంటర్‌లో 14 నుంచి 21 రోజుల పాటు పిల్లలకు అవసరమైన పోషకాహారం తయారు చేసి అందిస్తారు. దీంతో ఎంత సన్నగా ఉండే పిల్లలైనా బలంగా తయారవ్వడం కోసం పోషకాహార వంటశాల, వంట మనుషులు, నిపుణులు అందుబాటులో ఉంటారు.
ఈ కేంద్రం పనిచేసే విధానం : పోషకాహార పునరావాస కేంద్రంలో ఒక నెల వయస్సు నుంచి అయిదేళ్లలోపు తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలను చేర్చుకొని వైద్య, పోషకాహార చికిత్స, సంరక్షణ అందిస్తారు. పిల్లలకు సకాలంలో తగినంత నాణ్యమైన పోషహాకారం అందించడంపై దృష్టిపెడతారు. పిల్లల పోషణ, సంరక్షణ, తగిన పోషకాహారం అందించడంపై తల్లులకు కౌన్సెలింగ్ అందించి వారిలో ధృడమైన సామర్థ్యాన్ని పెంపొందిస్తారు. తీవ్ర మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలను 14 నుంచి 21 రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని తగిన పోషకాహారం, వైద్య చికిత్స అందించి వారి ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తారు.
పోషకాహార లోపంతో బాధపడుతున్న మా బాబును వారంరోజుల క్రితం ఇక్కడ చేర్పించాం. ఆసుపత్రిలో చేర్చినప్పుడు చాలా బలహీనంగా ఉండి.. తరచూ కిందపడేవాడు. సరైన పోషకాహారం అందించడంతోపాటు వైద్యచికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు బాబు చాలా వరకు కోలుకున్నాడు. మరో 10 రోజులు ఉండమన్నారు. పైసా ఖర్చు లేకుండా అందిస్తున్న సేవకు కృతజ్ఞతలు చాలవు.
- రజిత, సీతారామపురం, ఊరుగొండ
చికిత్స పొందిన పిల్లలు
- జనవరి - 206
- ఫిబ్రవరి - 286
- మార్చి - 331
- ఏప్రిల్ - 222
- మే - 272
- జూన్ - 326
- జులై - 287
- ఆగస్టు - 259
- సెప్టెంబరు - 370
పోషకాహారంతో కూడిన చికిత్స అందిస్తాం
మా దగ్గరకు తీవ్ర పోషకాహారం లోపం, బరువు తక్కువ, బక్కపల్చన అనారోగ్య సమస్యతో ఉన్న పిల్లలు ఎక్కువగా వస్తుంటారు. ప్రొటీన్ ఎక్కువగా ఉండే బాదం, రాగిజావ, దోశ, వెజ్ కిచిడి, ఉప్మా, పెసరపప్పు కిచిడి, పాలకూర, పప్పు, అటుకుల పాయసం, పాలు, ప్రొటీన్‌లడ్డూ, బఠానీ గింజల అన్నం, బీట్రూట్ రైస్, సోయా గింజల అన్నం, కర్జూరం, పాయసం ఇస్తుంటాం. చాలా మంది పిల్లలు మాదగ్గర అందించిన చికిత్సతో (పోషకాహారంతో) బరువు పెరిగి ఆరోగ్యంతో వెళ్లారు. పోషకాహారం లోపం ఉన్నట్లు గుర్తించి, ఇక్కడ చేర్పిస్తే పిల్లలకు చికిత్సతోపాటు, పోషకాహారం తయారీపై వారి తల్లులకు అవగాహన కల్పిస్తాం.- డాక్టర్ నరేష్ సముద్రాల, ఎన్‌ఆర్‌సీ, ఎంజీఎం ఆసుపత్రి
కేంద్రానివి పార్టిషన్ పాలిటిక్స్.. మావి న్యూట్రిషన్ పాలిటిక్స్ : మంత్రి హరీశ్‌రావు
KCR Nutrition Kit: కాబోయే అమ్మలకు అండగా.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్