Interview with Lawyers on Land Titling Act: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూహక్కు చట్టంపై న్యాయ నిపుణులు నిప్పులు చెరుగుతున్నారు. పేదలకు అండగా ఉన్న సివిల్ కోర్టులను నిర్వీర్యం చేస్తూ, ప్రజల ఆస్తులను బలవంతులు కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిస్థాయిలలో ఉన్న న్యాయవాదులు ఎనిమిది నెలలపాటు ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు.
ప్రజా చట్టాలు చేస్తున్నపుడు అన్ని అంశాలను పరిశీలించాల్సిన ప్రభుత్వం, భూ దందాలు చేసే వారికి అనుకూలంగా ఉందని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. పేద, అమాయక ప్రజల ఆస్తులను లాక్కునేలా చట్టాన్ని రూపొందించారని అన్నారు. ఈ చట్టాన్ని తక్షణమే నిలుపుదల చేయకపోతే చిన్నపాటి గూడు కట్టుకున్న వాడికి కూడా ఆస్తికి రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ చట్టం- 2019 భూ పత్రాలు, దస్త్రాల ట్యాంపరింగ్ జరగకుండా ఈ చట్టం తోడ్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ భూమి ఉన్నా పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడం, రికార్డుల్లో లోపాల కారణంగా చాలామంది యజమానులు పూర్తి స్థాయిలో హక్కులు పొందలేకపోతున్నారు. ఫలితంగా భూ వివాదాలు ఏర్పడితే సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈచట్టం ద్వారా ప్రజలకు భూమిపై సర్వహక్కులు కల్పించి పథకాలు అందిస్తామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు తిప్పలు తప్పడం లేదు.
మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ చట్టం (యాక్ట్ 27/2023) విషయంలో ఏపీ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం విషయంలో పలు కీలక తీర్మానాలు చేసింది. ప్రజా ప్రయోజనానికి, ముఖ్యంగా పేదలు, ఆర్థికంగా బలహీనవర్గాల వారికి విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేయాలని తీర్మానం చేసింది. అంతేకాక ల్యాండ్ టైటిలింగ్ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ ఏపీ బార్ కౌన్సిల్ తరఫున హైకోర్టులో వ్యాజ్యం వేయాలని తీర్మానించింది.
భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాదులు సైతం డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం భూ యాజమాన్య హక్కులను కాలరాస్తోందని వెంటనే జీవో 512ను రద్దు చేయాలంటూ ఆందోళను చేపడుతున్నారు. ప్రజల హక్కులను హరించే విధంగా జీవో ఉందని, ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చెందారు.