Technical Issues in Indiramma House Survey : పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇందులో భాగంగా సర్కారు చేపట్టిన ఇంటింటి సర్వేకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యతో సర్వే ఆగిపోతుంటే.. పట్టణాల్లో సర్వర్ మొరాయిస్తుండటంతో సర్వే సాఫీగా జరగడం లేదు. ఈ నేపథ్యంలో సర్వే యాప్ అప్‌డేట్ అయిన తర్వాత సర్వేయర్లు మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోజుకు ఒక్కో సర్వేయర్ సుమారు 40 కుటుంబాల వరకు సర్వే చేయగా.. ప్రస్తుతం సాంకేతిక సమస్యలతో 20 కుటుంబాల వివరాలు నమోదు చేయడమే పెద్ద సవాల్‌గా మారింది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపునకు సర్వేయర్లు నేరుగా అర్హుల ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్న నేపథ్యంలో యాప్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో సర్వేయర్లు తలలు పట్టుకుని తిప్పులు పడుతున్నారు. ఈనెల 25లోపు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సర్వే పూర్తిచేస్తామని ప్రకటించిన అధికారులు, ప్రస్తుతం యాప్‌తో ఎదుర్కొంటున్న ఇబ్బందులతో గడువు పెంచాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం చేపట్టిన సర్వే యాప్‌లో 14 కాలమ్స్ నింపాలి. మొదట అన్ని ప్రశ్నలకు సమాధానాలు పూరించాలి. సొంత ఇంట్లో ఉంటున్నారా ? అద్దె ఇంట్లో ఉంటున్నారా ? వంటి వివరాలను పొందుపరచాలి. ప్రస్తుతం అర్హులు ఉంటున్న ఇంటి ఫొటోలతోపాటు ఖాళీ స్థలం ఉంటి వాటికి సంబంధించి పత్రాలను యాప్‌లో అప్లోడ్ చేయాలి.
ఒక్కో ఇంటి వద్ద గంటల కొద్దీ : ఖాళీ స్థలం ఉందనే వివరాలు నమోదుచేశాక సంబంధిత వ్యక్తి పేరిట ఆ ఖాళీ జాగా ఉందా, ఇతర కుటుంబసభ్యుల పేరిట ఉందా అన్నది పూరించాలి. ఈ మేరకు డాక్యుమెంట్ వివరాలు నమోదు చేయడంతోపాటు కరెంట్ బిల్లు నిక్షిప్తపరచాలి. స్థలం ఫోటో దానికి సంబంధించి పత్రాలు పొందుపరచాలి. చివరిగా సర్వే రిమార్క్స్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులా కాదా అన్నది నింపాలి. అయితే ఈ నేపథ్యంలో అనేకసార్లు యాప్‌లో సర్వర్ మొరాయిస్తుండటంతో సర్వే ముందుకు సాగటం లేదు. దీంతో సర్వేయర్లు ఒక్కో ఇంటి వద్ద గంటల కొద్దీ ఉండాల్సి వస్తోంది. కొన్నిచోట్ల అయితే అర్హులే అందుబాటులో ఉండటం లేదు.
గడువులోగా సర్వే పూర్తిచేస్తాం : కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నా సర్వే వేగంగా కొనసాగుతోందని ఖమ్మం గృహ నిర్మాణశాఖ ఈఈ బి.శ్రీనివాస్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 1.25 లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు ఉండడం వల్లే ఎక్కువ సమయం పడుతోందని పేర్కొన్నారు. యాప్‌లో కొన్ని మార్పులు చేసి సర్వే చేస్తున్నట్లు వివరించారు. లబ్ధిదారుల గుర్తింపు అనేది ప్రాధాన్యాంశమని, ఈ నెల చివర తేదీలోపు సర్వే పూర్తిచేయాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు గడువులోగా సర్వే పూర్తిచేస్తామని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే - ఆ పథకం కింద లబ్ధి పొందితే ఇల్లు రాదట
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్ - 84 వేల ఇందిరమ్మ ఇళ్లు మీ కోసమే - కానీ ఆ ఒక్కటే సమస్య