IGBC Conduct Green Property Show in Hyderabad : భవన నిర్మాణాల వల్ల 35 శాతానికి పైగా విద్యుత్ వినియోగమవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా కర్బణ ఉద్గారాలు భారీగానే వెలువడతాయి. దీనివల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు, భూతాపం పెరిగి ప్రకృతి విపత్తులు ఏర్పడుతున్నాయి. ప్రపంచస్థాయి అవగాహన ఒప్పందాల్లో భాగంగా భారత్ రాబోయే 50 ఏళ్లలో కర్బణ ఉద్గారాలను పూర్తిస్థాయిలో తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అందులో భాగంగా కాలుష్యం భారీగా వెలువడే రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
Importance of Green Buildings : అభివృద్ధికి ఆటంకం కలగకుండానే పర్యవరణహిత చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. భవన నిర్మాణాల్లోనూ పర్యావరణహిత వస్తువులను ఉపయోగించడంతో పాటు నిర్మాణ సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కర్బణ ఉద్గారాలను తగ్గించొచ్చని తేల్చారు. ఇందులో భాగంగా ఐజీబీసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇతర నిర్మాణ సంస్థలు హరిత భవనాలను నిర్మిస్తూ పర్యావరణ పరిరక్షణకు ముందడుగేస్తున్నాయి.
ఇల్లు కట్టేందుకు రెడీ అవుతున్నారా? ఈ 4నెలల్లో స్టార్ట్ చేస్తే చాలా మంచిది!
గ్రీన్ ప్రాపర్టీ షో మంచి స్పందన : ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హరిత భవనాల ప్రాధాన్యం గురించి వివరించేందుకు గ్రీన్ ప్రాపర్టీ షోలు నిర్వహిస్తున్నారు. గతేడాది జులైలో నిర్వహించిన ప్రాపర్టీకి షోకు ఇళ్ల కొనుగోలుదారులతో పాటు, నిర్మాణ సంస్థల్లోనూ మంచి స్పందన వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఐజీబీసీ జాతీయ ఉపాధ్యక్షుడు శేఖర్ రెడ్డి హైటెక్స్‌లో మూడు రోజుల పాటు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. పేరొందిన నిర్మాణ సంస్థలు తాము నిర్వహిస్తున్న హరిత భవనాల వివరాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి.
"గ్రీన్ హౌస్ ఎలా కట్టుకోవాలో షోలో వివరిస్తారు. దీంతో పాటు మెటీరియల్ ఎలాంటిది వాడాలో చెబుతారు. పర్యావరణానికి అనుసంధానంగా ఉండాలనుకుంటే ఇలాంటి ప్రాపర్టీ షోలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరి కల ఒక మంచి ఇల్లు కట్టాలని. ఇలాంటి షోలు మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి." - రాజశేఖర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్
Green Property Show Dates : ఐజీబీసీ ఆధ్వర్యంలో భవనాలకు సర్టిఫికేషన్ ఉంటుంది. హరిత భవనాల్లో నివాసం ఉంటే సహజసిద్ధంగా వచ్చే గాలి వెలుతురు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవని శాస్త్రీయంగా నిరూపితమైందని నిర్వాహకులు చెబుతున్నారు. అంతే కాకుండా విద్యుత్ వినియోగమూ తగ్గుతుంది. ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్యానళ్లతో పాటు నీటిని పునర్‌వినియోగించేలా ఏర్పాట్లు ఉంటాయి. 19వ తేదీ వరకు జరిగే గ్రీన్ ప్రాపర్టీషోలో హరిత భవనాల నిర్మాణం, వినియోగించే వస్తువులు, కలిగే ప్రయోజనాల గురించి నిర్వాహకులు వివరిస్తున్నారు. హరిత భవనాల పట్ల కొనుగోలుదారులకు అవగాహన పెంచడం ద్వారా ఆ తరహా నిర్మాణాలు పెంచే విధంగా ఐజీబీసీ ప్రణాళిక సిద్ధం చేసింది.