HYDRA Focuses on Encroached Ponds Beautification in Hyderabad : నెల రోజుల పాటు కూల్చివేతలకు విరామం ఇచ్చిన హైడ్రా, ఈ సమయంలో మహానగరం పరిధిలోని ప్రతి చెరువు చరిత్రను వెలికి తీయాలని నిర్ణయించింది. ఇందులో సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. దీనికి అత్యాధునిక వ్యవస్థలను ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకుండా రియల్ టైం లొకేషన్ వ్యవస్థనూ అందుబాటులోకి తేవడానికి హైడ్రా కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే కూల్చిన చెరువులను తిరిగి పునరుద్ధరించడానికి హైడ్రా ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఇప్పటికే కూల్చివేతలు చేపట్టిన చెరువుల సుందీరకరణను పనులను ఈ వారంలో మొదలు పెట్టాలని నిర్ణయించింది. డిసెంబర్ నెలాఖరు నాటికి కొన్ని చెరువుల సుందరీకరించి, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకుంటున్నారు.
వారి వల్లే నగరంలో ఆక్రమణలు : నగరంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఎలాంటి పరిశీలనలు చేయకుండా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతోనే అక్రమాలు జరుగుతున్నాయని తేలింది. ఒక సర్వే నంబర్‌ను తీసుకుని, మరో సర్వే నంబరులో భవనాలు నిర్మిస్తున్న విషయం హైడ్రా గుర్తించింది. ఇలాంటివి పునరావృత్తం కాకుండా రియల్‌టైం లొకేషన్ వ్యవస్థను తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఒక సర్వే నంబర్‌ను కొడితే, దాని ఫొటోతో సహా క్షేత్రస్థాయిలో కో-ఆర్డినేట్స్ అధికారులకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో 185, హెచ్‌ఎండీఏ పరిధిలో 3500 చెరువులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను గుర్తించలేదు. కొన్నింటికి ప్రాథమికంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు చెరువులన్నింటి చరిత్రను బయటకు తీస్తున్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉపగ్రహ చిత్రాలతో ప్రస్తుతం ఉన్న చెరువులను సరిచూస్తుంది. ప్రతి చెరువులో 60 శాతం ఆక్రమణకు గురైనట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.
ఎఫ్టీఎల్ పరిధిలో రెండు పెద్ద భవనాలు : మూసాపేటలో చెరువును ఓ నిర్మాణ సంస్థ సీఎస్‌ఆర్ కింద అభివృద్ధి చేయడానికి తీసుకుని ఎఫ్‌టీఎల్‌ను మార్చేశారని అంటున్నారు. బాచుపల్లిలో ఓ నిర్మాణ సంస్థ ఏకంగా చెరువు ఎఫ్‌టీఎల్‌లోనే రెండు పెద్ద టవర్లు నిర్మించినట్లు తేల్చారు. క్షేత్రస్థాయిలో ఈ సమాచారాన్ని అంతటిని సేకరించి అన్ని ఆధారాలతో ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నారు. నోటీసులు ఇచ్చిన వారికి కొంత గడువు ఇచ్చాకే కూల్చివేతలు చేపట్టాలని నిర్ణయించింది.