Huge Increase in Electricity Consumption in Telangana : రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. ఒకవైపు వ్యవసాయం కోసం, మరోవైపు పరిశ్రమలు, గృహ అవసరాలకు విద్యుత్‌ను భారీగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ (Electricity Demand) అనూహ్యంగా పెరిగిపోయిందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది మే నెలలో 15,497 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఈసారి మార్చి నెలలోనే 15,623 మెగావాట్ల అత్యధిక డిమాండ్ ఏర్పడినట్లు చెబుతున్నారు.
ఇది రాబోయే నెలలో 16,500ల మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది మార్చి నెల సరాసరి విద్యుత్ వినియోగం 57.84 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి నెలలో సరాసరి విద్యుత్ వినియోగం 70.96 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. అంటే సుమారు 22.7 శాతం విద్యుత్ అత్యధికంగా పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా ప్రతి ఏటా 8 నుంచి 10 శాతం మాత్రమే విద్యుత్ వినియోగం జరుగుతుంది. కానీ ఈసారి అంచనాలకు మించి విద్యుత్ వినియోగం పెరిగిందని అంచనా వేస్తున్నారు.
Power Consumption in Telangana : ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం 100 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. అందుకోసం ప్రతిరోజూ పవర్ఎక్ఛేంజ్లో సుమారు 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలుస్తోంది. మిగిలింది గతంలో మన దగ్గర విద్యుత్ ఉన్నప్పుడు, ఇతర రాష్ట్రాలకు అందజేసిన విద్యుత్‌ను ఇప్పుడు మన రాష్ట్రానికి వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సీజన్లో విద్యుత్ వినియోగం 90 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రతిరోజూ మూడంచెల సమీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మొదట సీఎండీలు, సీజీఎంలు, ఎస్ఈలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత సీజీఎంలు ఎస్ఈలు, ఈడీలు, ఏఈ స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. డీఈలు, ఏఈలు క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా తీరుపై ప్రతి రోజూ ఉదయం 8:30 గంటలకు అన్ని జోన్ల సర్కిళ్ల సీజీఎం, ఎస్ఈలతో ఎస్పీడీసీఎల్ (SPDCL) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో గతేడాది మార్చిలో 15,497 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ విద్యుత్ డిమాండ్, ఈనెల 08వ తేదీన 15,623 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. గతేడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్లు అత్యధిక విద్యుత్ వినియోగంగా నమోదవగా, ఈ ఏడాది మార్చి 14వ తేదీన 308.54 మిలియన్ యూనిట్ల అత్యధిక డిమాండ్ నమోదు అయ్యింది. రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ పెరగనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణి ఫోకస్ - రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ కేంద్రం!