Telangana HC Comments On Govt Policy About Engineering Seats : కొత్త కోర్సుల అనుమతులకు సంబంధించిన కాలేజీల దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనం, రద్దుకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ పలు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను సింగిల్ జడ్జి కొట్టివేస్తూ, ప్రభుత్వ నిర్ణయమే అంతిమమని ఈనెల 9న తీర్పు వెలువరించింది.
సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై జస్టిస్ సుజయ్ పాల్, నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏఐసీటీఈ నుంచి ఆమోదం పొంది, జేఎన్టీయూ నుంచి అనుబంధ గుర్తింపు తీసుకున్న తర్వాత ప్రభుత్వం అనుమతులు తిరస్కరించిందని ఇంజినీరింగ్ కళాశాలల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాదాపు 30 శాతం కాలేజీలు కేవలం కోర్సుల విలీనానికే దరఖాస్తు చేసుకున్నాయని, కొత్త సీట్లను అడగటం లేదన్నారు.
కాలేజీల ప్రతిపాదనలను తిరస్కరించిన ఉన్నత విద్యామండలి : కంప్యూటర్ కోర్సు, దాని అనుబంధ కోర్సులను సీట్లను పెంచుకోవడానికి జేఎన్టీయూ ఎన్వోసీ జారీ చేసిందన్నారు. దీని ఆధారంగా కాలేజీలు ఏఐసీటీఈ ఆమోదానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఏఐసీటీఈ తనిఖీలు నిర్వహించి మౌలిక వసతులు, బోధనా సిబ్బంది ఉండటంతో అనుమతి మంజూరు చేసిందన్నారు. అయితే ప్రభుత్వ అనుమతితో కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్న ఏఐసీటీఈ షరతు మీద ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. కాలేజీల ప్రతిపాదనలను ఉన్నత విద్యామండలి తిరస్కరించిందన్నారు.
విద్యా ప్రమాణాలను పెంచడం ప్రభుత్వ బాధ్యత అని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి వాదించారు. షరతులతో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జేఎన్టీయూ జారీ చేస్తుందని, దాని ఆధారంగా కాలేజీలు ఏఐసీటీఈ నుంచి ఆమోదం తీసుకుని, ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉందన్నారు. సీట్ల పెంపునకు ఫీజు రీయంబర్స్‌మెంట్ వంటి ఆర్థిక పరిమితులే కారణం కాదన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు అనుమతి మంజూరు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు.
High Court Judgement On Engineering Seats Increases : విద్యాచట్టంలోని సెక్షన్ 20 కింద అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. పరిమితికి మించి అనుమతులు మంజూరు చేయడం వల్ల విద్యాప్రమాణాలు పడిపోయాయన్నారు. కాలేజీలను నిపుణుల కమిటీ సందర్శించి వసతులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. కొన్ని కాలేజీలకు అదనంగా 120 సీట్లు పెంచుకోవడానికి అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు.
కంప్యూటర్ సైన్స్ సీట్లను పెంచితే అధ్యాపకుల కొరత ఉందని, అందువల్ల సంప్రదాయ కోర్సులైన సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ సీట్లను పునరుద్ధరించాలంటూ జులైలో ఏఐసీటీఈకి జేఎన్టీయూ రిజిస్ట్రార్ లేఖ రాశారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకుని కాలేజీల మధ్య సమతుల్యత పాటిస్తూ నిబంధనల ప్రకారం కొన్ని కాలేజీలకు సీట్ల పెంపునకు అనుమతించినట్లు తెలిపారు.
అవసరమైతే కౌన్సెలింగ్ తేదీలను సవరించుకోవాలి : సీట్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వ అనుమతులపై హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొనసాగించలేమని, ప్రభుత్వమే పునఃపరిశీలించి నిర్ణయం తీసుకుంటామంటే కాలేజీల దరఖాస్తులను వెనక్కి పంపుతామని కోర్టు పేర్కొంది.
అలా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం నిరాకరించిన పక్షంలో తామే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని పేర్కొంది. కాలేజీల దరఖాస్తులను పునఃపరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏజీ చెప్పడంతో ధర్మాసనం అప్పీళ్లపై విచారణను ముగించింది. కాలేజీల దరఖాస్తులను పరిశీలించి చట్టబద్ధంగా సహేతుకమైన నిర్ణయాలను తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే కౌన్సెలింగ్ తేదీలను సవరించుకోవాలని సూచించింది.