Heavy Rains in AP : బంగాళా ఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో పంటలు నీటమునిగాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తోన్న వానతో విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాలిక మృతి చెందింది. కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారో అని అధికారులు పరిశీలిస్తున్నారు. రెండ్రోజులుగా విజయవాడలో వర్షాలకు కురుస్తున్నాయి. విజయవాడ రామవరప్పాడు రింగ్‌రోడ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రింగ్‌రోడ్ నుంచి నిడమానూరు వరకు వర్షపు నీటిలోనే కార్లు, బైకులు ఆగిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడలోని వన్‌టౌన్, గురునానక్ కాలనీ, చుట్టుగుంట, కృష్ణలంక, రామలింగేశ్వరనగర్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు సహా బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి విజయవాడ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విద్యాధరపురం, ఆర్‌ఆర్‌నగర్‌లో రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీటిలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి.
MP Kesineni Chinni on Heavy Rains : భారీ వర్షాల కారణంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అలర్ట్‌గా ఉండి అవసరమైన సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోల్స్, కరెంట్ తీగల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగే వాగులు, వంకల దగ్గర అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదీ పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఎంపీ కేశినేని చిన్ని పరిస్థితి సమీక్షిస్తున్నారు.
విజయవాడలో వర్షాల పరిస్థితిపై కంట్రోల్‌రూమ్‌లో కలెక్టర్ సృజన సమీక్షిస్తున్నారు. మొన్నటినుంచి కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాల వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం తగ్గి రోడ్లపై నీరు తగ్గేంతవరకు బయటకు ప్రజలు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.