Heavy Rain Fall in Across Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడడంతో రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ముసురు కమ్ముకుంది. జంటనగరాల పరిధిలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ రెస్క్యూ టీంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి.
నీరు నిలిచే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వరదనీటిని నాలాల్లోకి మళ్లిస్తూ ఆయా ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వచ్చిన పర్యాటకులు తడిసిముద్దయ్యారు. మణికొండలోని పంచవటి కాలనీలో వర్షం ధాటికి ఓ అపార్ట్‌మెంట్ ముందున్న భారీ వృక్షం నెలకొరిగి రివర్స్ చేస్తున్న కారు మీద పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. అందులో ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు.
మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తివేత : భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుండగా 85 గేట్లేత్తి నీటిని కిందకు వదలుతున్నారు. అన్నారం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న నీటిని 66 గేట్లేత్తి దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 35 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. మరోవైపు చర్ల మండలంలోని తాళిపేరు జలాశయానికి భారీగా వచ్చి వరద నీరు చేరుతుంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు నదిలో వేటకు వెళ్లొద్దని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఎగువ నుంచి భారీగా వరద నీరు : మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరువవుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద దృష్ట్యా జూరాల జల విద్యుత్ కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి ప్రారంభించారు. హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి, రామగుండం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ యంత్రాలు బురద రోడ్లలో కదలలేని పరిస్థితి నెలకొంది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భూపాలపల్లి జిల్లాలోని మొరంచ వాగు, చలివాగు, మానేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఘనపురం మండలంలోని పలు పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల, రాఘవరెడ్డి పేట గ్రామాల మధ్య రవాణాకు ఆటంకం ఏర్పడింది. ములుగు జిల్లా చిన్నబోయినపల్లి జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. అయినా సరే వైద్య సిబ్బంది వెనుదిరగకుండా వాగులోంచి వెళ్లి మరీ గిరిజనులకు వైద్యం అందిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిండుకున్న చెరువులు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో సాగుచేసిన పంటలకు ఊపిరిపోసినట్లు అవుతుందని అన్నదాతలు హర్షిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు, పాకాల, పాలేరు వాగులు పొంగి పోర్లుతున్నాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను వరదలు ముంచేత్తాయి. వాగు నిండుగా ప్రవహించడంతో గుండి గ్రామానికి బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోతాయి. దీంతో ఎవరూ వర్షం పడే సమయంలో ఇళ్ల నుంచి బయటికి రాకూడదని, కరెంటు పోల్స్‌ను ముట్టుకోకూడదని అధికారులు డప్పు చాటింపు వేయించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం : భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సీఈలందరూ హెడ్ క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైన తాత్కాలిక మరమ్మతులు తక్షణమే చేపట్టాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు, ఇతర అధికారుల సహాయం తీసుకోవాలని మంత్రి సూచించారు.
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు - అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి - Heavy to very heavy rains today