MBBS seats in Telangana 2024 : ఎంబీబీఎస్ అడ్మిషన్‌లకు రంగం సిద్ధమవుతోంది. నీట్-యూజీ పరీక్షపై వచ్చిన ఆరోపణలు, సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ తదితర అంశాలతో ఏర్పడిన గందరగోళం ఎట్టకేలకు వీడింది. దీంతో కౌన్సిలింగ్ నిర్వహణ దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది. 2024-25 విద్యాసంవత్సర తరగతులను అక్టోబర్ 1 నాటికి ప్రారంభించడమే లక్ష్యంగా కౌన్సిలింగ్ ప్రక్రియకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) శ్రీకారం చుట్టింది.
ఈ క్రమంలో తెలంగాణలోని కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహణపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కూడా సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 56 వైద్య కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 3,915, ప్రైవేట్ కాలేజీల్లో 4,600 కలిపి మొత్తం 8,515 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న 3,915 సీట్లలో జాతీయ కోటా కింద 15 శాతం సీట్లు(587) మినహాయిస్తే, కన్వీనర్ కోటాలోని 3,328 సీట్లు తెలంగాణలోని విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఇక ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 2,300, బీ-కేటగిరీలో 1,955, సీ-కేటగిరీలో 345 ఉన్నాయి.
NEET Counseling in Telangana 2024 : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి మొత్తం 5,628 కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో పది వైద్య కళాశాలల ఏర్పాటుకు ఎన్‌ఎంసీ ఇప్పటికే ప్రాథమిక అనుమతులు ఇచ్చింది. వీటిలో ఎనిమిది ప్రభుత్వ కాలేజీలు ఉండగా, మరో రెండు ప్రైవేటువి. వీటికి తుది అనుమతులు లభిస్తే మరో 500 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2024-25 విద్యాసంవత్సరానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఏకకాలంలో కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
నిరుటి కన్నా పెరిగిన అర్హులు : తెలంగాణలో ఈసారి నీట్-యూజీ పరీక్షను 77,849 మంది విద్యార్థులు రాశారు. వీరిలో 47,371 (60.8%) మంది అర్హత సాధించారు. గత ఐదు సంవత్సరాల్లో 60 శాతం మందికి పైగా అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఎంబీబీఎస్ సీట్లకు పోటీ మరింత పెరిగింది. గత ఆరేళ్లుగా నీట్-యూజీ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల గణాంకాలను విశ్లేషిస్తే, పరీక్ష రాసే విద్యార్థులతో పాటు అర్హత సాధించేవారు ఏటేటా పెరుగుతున్నారు. గతేడాది 72,842 మంది పరీక్షకు హాజరు కాగా, 42,654 (58.5%) మంది అర్హత సాధించారు.
ఆ 520 కన్వీనర్ కోటా సీట్లూ తెలంగాణ విద్యార్థులకే : మరోవైపు గత సంవత్సరం తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్ నిబంధనలు-2017లో సవరణ చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ఏర్పాటైన వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలోని వంద శాతం సీట్లు ఇక్కడి విద్యార్థులకే రిజర్వ్ అవుతాయి. గతంలో జాతీయ కోటా 15 శాతం పోను, మిగిలిన 85 శాతం సీట్లను 100గా పరిగణించి వాటిలో 85 శాతం సీట్లను రాష్ట్రానికి కేటాయించేవారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడేవారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ 15 శాతం సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పాటైన కాలేజీల్లో ఈసారి జాతీయ కోటా పోను మిగిలే 520 ఎంబీబీఎస్ సీట్లూ పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే లభించే అవకాశం ఉందంటున్నారు. కౌన్సెలింగ్ నాటికి దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు.
2023-24 విద్యాసంవత్సరంలో విభాగాల వారీగా ఎంబీబీఎస్ సీట్లు దక్కిన చివరి ర్యాంకులు :
కేటగిరి | లోకల్ | అన్రిజర్వ్డ్ |
ఓపెన్ | 1,60,979 | 58,727 |
ఈడబ్ల్యూఎస్ | 1,42,345 | - |
ఎస్సీ | 2,45,043 | 1,54,893 |
ఎస్టీ | 2,30,180 | 1,97,167 |
బీసీ (ఏ) | 2,58,239 | 1,09,281 |
బీసీ (బీ) | 1,82,579 | 1,01,463 |
బీసీ (సీ) | 2,66,945 | 1,01,496 |
బీసీ (డీ) | 1,75,555 | 78,569 |
బీసీ (ఈ) | 1,84,367 | 1,11,470 |
మైనారిటీ కాలేజీల్లో | 1,84,179 | 1,18,790 |
Costliest MBBS Colleges In India : దేశంలోనే అత్యంత ఖరీదైన MBBS డిగ్రీ.. ఆ కాలేజీలో ఫీజు రూ.కోట్లలో!