Harish Rao letter to Rahul Gandhi : మేనిఫెస్టోలో హామీల అమలును ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ మాజీమంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) లేఖ రాశారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి అరచేతిలో స్వర్గం చూపిస్తూ హామీలను ఇవ్వడం, ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ఆరోపించారు. హామీల అమలు విషయం చరిత్రలో ఎన్నోసార్లు రుజువైందని, కాంగ్రెస్ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను గుప్పిస్తూ మేనిఫెస్టోలను విడుదల చేశారన్నారు.
Harishrao fires on Congress : రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టే అధికారంలోకి వచ్చిందని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. కానీ అప్పుడు ఇచ్చిన హామీలు, నేటికి అమలు చేయలేదన్నారు. 2023లో కూడా తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని. ఆ తర్వాత అన్ని హామీలను విస్మరించారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారని, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అనేకసార్లు మాట తప్పిన మీరు, మళ్లీ ఏ నైతిక ధైర్యంతో మేనిఫెస్టో విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
'అసలు మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉన్నదా ? ఒక్కదానినైనా అమలు చేశారా ? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు? ఈసారి మీ మేనిఫెస్టోలో చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం పొంతనలేదని విషయం ఇప్పటికే రుజువైందని' హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకార సందర్భంగా కూడా ఆరు హామీలకు చట్టబద్ధత కల్పించే పత్రంపై మీ సమక్షంలోనే సంతకాలు కూడా చేశారని, వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించారన్నారు.
కానీ అధికారంలోకి వచ్చి 120 రోజులు అవుతుందని, ఇచ్చిన హామీలేవి తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ఉద్దేశం, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలందరికీ నెలకు ₹2,500 చొప్పున బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామన్నారని, కానీ నేటి వరకు ఒక్క మహిళకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం అందలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్ కూడా ఇచ్చి, ఇంకా పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్పదమని లేఖలో వెల్లడించారు.