BRS Leader Harish Rao Fires On Congress Party : హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రామా చేస్తున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను చంపేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వం తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. రేవంత్‌రెడ్డి తీరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనీసం గ్రామాల్లో తిరగలేని పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి వచ్చిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.800 కోట్లు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించిందని తీవ్రంగా ఆరోపించారు.
తొమ్మిది నెలల పాలనలోనే 2 నెలల పింఛన్లు మింగేశారని ధ్వజమెత్తారు. పారిశుద్ధ్య నిర్వహణ పడకేయడంతో వ్యాధులు పెరిగాయని, ఫార్మాసిటీ, మెట్రో రైలు విషయంలో రూటు మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 50శాతానికి మించి రైతు రుణమాఫీ కాలేదన్న హరీశ్‌రావు, కేవలం 21 లక్షల మంది రైతులకు మాత్రమే అయినట్లు వివరించారు. రైతులకు 100 శాతం రుణమాఫీ అయ్యేదాకా, పంట బీమా, భరోసా కల్పించకపోతే రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.
యూట్యూబ్‌లు చూస్తే రేవంత్‌రెడ్డి వెన్నులో వణుకు పుడుతోంది : 10 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామపంచాయతీకి నిధులు విడుదల అవ్వట్లేదని, సర్పంచులను కదిలిస్తే కన్నీళ్లు బయటకు వస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ప్రతినెలా పల్లె ప్రగతికి నిధులు వచ్చాయని, ఇప్పుడేమో నిధులు కరవయ్యాయని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాలను గ్రామాలను గాలికి వదిలేసి, హైడ్రా పేరిట డ్రామాలు చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిస్తున్న యూట్యూబ్‌లు చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నుల్లో వణుకు పుడుతొందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
"రైతులకు బోనస్ ఇస్తామన్న మాట బోగస్ అయ్యింది. మరోవైపు పంటల బీమా అటకెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల గారడితో కాలం వెల్లదీస్తున్నారు. రాష్ట్రంలో పారిశుధ్యం లోపించింది. అందుకే రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ బాగా పెరిగిపోతున్నాయి. పది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. రాష్ట్రంలో అన్ని సమస్యలపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం."- హరీశ్‌రావు, బీఆర్ఎస్ సీనియర్ నేత
మీ రాజకీయాల కోసం కుటుంబ బంధాల మధ్య చిచ్చుపెట్టారు : హరీశ్‌రావు - Harish Rao sensational comments