Half Day For Primary Schools in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి(బుధవారం) నుంచి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు ఒంటిపూట మాత్రమే పని చేయనున్నాయి. ఇప్పుడు ఒంటిపూట బడులేంటి అని అనుకుంటున్నారా ? అవును నిజమే. కానీ ప్రైమరీ పాఠశాలలకు మాత్రమే. అయినా వారికి మాత్రమే ఎందుకు అంటే రాష్ట్రంలో నేటి నుంచి చేపట్టనున్న కుల గణనకు ఉపాధ్యాయులను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ప్రాథమిక పాఠశాలలు నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కులగణనకు మొత్తం పాఠశాల విద్యా శాఖ నుంచి 50 వేల మంది వరకు సిబ్బందిని వినియోగించనున్నారు.
ఇందులో 36 వేల 559 మంది ఎస్జీటీ, 3 వేల 414 మంది ప్రైమరీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, 6 వేల 256 మంది ఎంఆర్సీలు, 2 వేల మంది ప్రభుత్వ మినిస్టీరల్ స్టాఫ్ సహా వివిధ విభాగాలకు చెందిన వారు ఉన్నారు. అయితే ఉపాధ్యాయుల కొరత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బోధనా పరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు కులగణన నుంచి మినహాయింపు ఇచ్చారు. సర్వే పూర్తి అయ్యేవరకు ఇది అమల్లో ఉంటుందని ఇప్పటికే సర్కార్ స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొననున్న ఉపాధ్యాయులకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వేతనాలు చెల్లిస్తుందని వెల్లడించింది.
75 ప్రశ్నలతో సర్వే : సుమారు 75 ప్రశ్నలతో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో కుల గణనకు ఉపాధ్యాయులు సర్వే చేయనున్నారు. వీటితో కుటుంబాల నుంచి సమాచారం సేకరిస్తారు. ఇందులో ముఖ్యంగా 56 ప్రధాన ప్రశ్నలు ఉండగా మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం రెండు పార్టులుగా ఎనిమిది పేజీల్లో సమాచారం పూరించనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు అడుగుతారు. ఇంట్లో ఎంత మంది ఉన్నారు ? ఎవరైనా విదేశాలకు వెళ్లారా ? వెళితే ఎందుకు వెళ్లారు ? మీ కుటుంబంలో ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉన్నారా ? అంటూ ఇలా ప్రశ్నలు అడిగి వివరాలను సేకరిస్తారు.
విద్యార్థులకు గుడ్న్యూస్ - ఈ నెల 6 నుంచి ఒంటిపూట బడులు - ఇప్పుడు ఎందుకంటే?
పిల్లలు నడుపుతున్న 'స్కూల్ బ్యాంకు' - అక్కడ విద్యార్థులే ఉద్యోగులు - ఎక్కడంటే?