Hidden Camera Scandal in AP Engineering College : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న కార్తీక్-జెస్సీ స్నేహితులు. వీరి స్నేహం ప్రేమకు దారి తీసింది. క్లాసుకు వెళ్లినా, క్యాంటీన్‌కు వెళ్లినా, ల్యాబ్‌కు వెళ్లినా ఈ ఇద్దరు ఎప్పుడూ చెట్టాపట్టాలేసుకుని క్యాంపస్‌లో తిరుగుతూ ఉండేవారు. ఇక రోజంతా క్లాస్‌లో కలిసి ఉండేవారు, కాలేజ్ అయిన తర్వాత ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకుంటుండే వారు. ఈ క్రమంలోనే ఎక్కువగా వీడియో కాల్స్ చేసుకునే వారు. వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో కార్తీక్.. జెస్సీ వీడియోను స్క్రీన్ షాట్ తీశాడు. అలా జెస్సీకి సంబంధించి వందల స్క్రీన్ షాట్స్‌ను తీసి సేవ్ చేసుకున్నాడు కార్తీక్.
ఇదే కాలేజ్‌లో చదువుతున్న జై.. కార్తీక్‌కు బెస్ట్ ఫ్రెండ్. ఈ ఇద్దరూ చాలా కలిసి మెలిసి ఉండేవారు. కాలేజ్‌లో ఎవర్ని అడిగినా ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెబుతారు. ఇక బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో కార్తీక్, జై ఇద్దరు తరచూ ఒకరి ఇంటికి మరొకరు వెళ్తూ వాళ్ల ఫ్యామిలీలతో కూడా బాగా కలిసిపోయారు. అలా కార్తీక్ ఎక్కువగా జై ఇంటికి వెళ్లడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో జై చెల్లెలు స్వీటీతో కార్తీక్‌కు పరిచయం ఏర్పడింది. అలా స్వీటీతోనూ కార్తీక్ నెమ్మదిగా లవ్ ట్రాక్ నడిపాడు. జెస్సీతో వీడియో కాల్స్ మాట్లాడినట్టుగానే, స్వీటీతో కూడా మాట్లాడేవాడు. ఆమెతో కూడా కాల్స్‌ను స్క్రీన్ షాట్ తీసేవాడు.
ఆర్య ఎంట్రీతో అసలు ట్విస్ట్ : అయితే ఓ విషయంలో కార్తీక్-జై మధ్య మనస్పర్థలు వచ్చాయి. చిన్నగా మొదలైన వాగ్వాదం పెద్ద గొడవకు దారి తీయడంతో మాటామాటా పెరిగి జెస్సీతో కార్తీక్ మాట్లాడిన వీడియో కాల్స్ స్క్రీన్ షాట్స్ అన్ని కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్‌లో వైరల్ చేస్తానని జై బెదిరించాడు. కార్తీక్ కూడా.. జై చెల్లెలయిన స్వీటీతో తాను మాట్లాడిన స్క్రీన్ షాట్స్ బయటపెడతానంటూ జైను బెదిరించాడు. ఈ ఇద్దరి మధ్య వివాదం సీనియర్ విద్యార్థుల వద్దకు వెళ్లింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. కార్తీక్-జైల మధ్య గొడవలోకి ఆర్య అనే మరో విద్యార్థి ఎంటర్ అయ్యాడు. (ఆర్యకు కార్తీక్ లవ్ చేస్తున్న జెస్సీ అంటే చాలా ఇష్టం. వన్ సైడ్ లవర్.)
అసత్య ప్రచారంతో ఆగమాగం : వీళ్ల గొడవ మధ్యలో జెస్సీని తీసుకు వస్తున్నారన్న కోపంతో ఆర్య ఓ ప్లాన్ వేశాడు. గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని, అక్కడ తీసిన వీడియోలను క్యాంపస్‌లోని చాలా మంది అబ్బాయిలకు అమ్ముతున్నారంటూ కార్తీక్, జైపై అసత్య ప్రచారం మొదలు పెట్టాడు. అలా కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలున్నాయన్న ప్రచారంతో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇలా ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన ఈ వ్యవహారం హిడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అసలు కథ ఇదన్న మాట.
NOTE : విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వాస్తవ పేర్లను ఇక్కడ మార్చి రాయడం జరిగింది.
విచారణకు ప్రభుత్వం ఆదేశం : ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై విచారణకు ఆదేశించారు. జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో తప్పు చేశారని తేలితే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.